అమరావతి ఆర్5 జోన్‌పై విచారించనున్న సుప్రీంకోర్టు
*తమ వాదన వినకుండా తుది తీర్పు ఇచ్చారని... సుప్రీంకోర్టును ఆశ్రయించిన అమరావతి రైతులు
Amaravati R5 Zone: అమరావతి ఆర్5 జోన్‌పై సుప్రీంకోర్టు విచారించనుంది. అమరావతి ఆర్5 వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో తమ వాదన వినకుండా తుది తీర్పును ప్రకటించవద్దని కోరుతూ అమరావతి రైతులు సుప్రీంకోర్టును కోరారు. ఈ మేరకు అమరావతి రైతులు సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో రైతుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లో పార్టీలుగా చేర్చి సుప్రీంకోర్టు దీనిపై విచారణ జరపబోతోంది.
మరోవైపు సుప్రీంకోర్టులో అమరావతి రాజధానిని మార్చడంపై దాఖలైన అసలు పిటిషన్లను విచారణ జరుపుతున్న జస్టిస్ సంజయ్ ఖన్నా ధర్మాసనమే ఇప్పుడు అమరావతి ఆర్ 5 జోన్ పిటిషన్లను విచారించబోతోంది. అమరావతి వ్యవహారంపై ఆ ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులకు పూర్తి అవగాహన ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతి ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చే తీర్పు చాలా కీలకంగా మారబోతోంది. ఎందుకంటే ఎన్నికల్లోపు ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని జగన్ సర్కార్ పట్టుదలగా ఉంది. కేంద్రం నిధులివ్వకపోయినా తామే స్వయంగా నిధులిచ్చి వీటిని పూర్తి చేయించాలని భావిస్తోంది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా ఈ కార్యక్రమం చేపట్టబోతంది.