Tirupati Laddu Row: తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Tirupati Laddu Row: తిరుపతి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో కల్తీ విషయమై విచారణకు స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Update: 2024-10-04 05:44 GMT

Tirupati Laddu Row: తిరుపతి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో కల్తీ విషయమై విచారణకు స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ నుంచి ఇద్దరు, సిట్ నుంచి ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు సభ్యులుగా ఉండాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

తిరుపతి లడ్డూకు ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే విషయం వెలుగు చూసిన తర్వాత సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం విచారణ నిర్వహించింది. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సుబ్రమణ్యస్వామి సహా మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిగింది. వైవీ సుబ్బారెడ్డి తరపున కపిల్ సిబల్, టీటీడీ తరపున సిద్దార్ధ్ లూథ్రా , తన పిటిషన్ పై సుబ్రమణ్యస్వామి వాదనలు వినిపించారు.

ఈ కల్తీ విషయమై ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ తో దర్యాప్తు సరిపోతోందా.. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ ఆలోచనను చెప్పాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందంపై తమకు ఎలాంటి సందేహలు లేవని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. ఈ దర్యాప్తు సంస్థకు సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షిస్తారని కోర్టు తెలిపింది.ఇవాళ సాయంత్రంలోపుగా సిట్ లో ఎవరెవరు సభ్యులుగా ఉంటారనే విషయమై స్పష్టత రానుంది.

కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం: సుప్రీం

తిరుపతి లడ్డూ అంశం కోట్లాది భక్తులకు సంబంధించింది. దీన్ని పొలిటికల్ డ్రామాగా మార్చొద్దని ఉన్నత న్యాయస్థానం సూచించింది. లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో కల్తీ ఎలా జరిగింది.దీనికి ఎవరూ కారణం.. ప్రస్తుతం లడ్డూ నాణ్యత ఎలా ఉంది అనే విషయాలపై ఈ ఐదుగురు సభ్యుల కమిటీ దర్యాప్తు చేయనుంది.

Tags:    

Similar News