విశాఖ ఏజెన్సీలో గుట్టుగా గంజాయి సాగు !

Update: 2020-07-01 06:32 GMT

విశాఖ ఏజెన్సీ పేరు చెబితే ప్రకృతి సౌందర్యం గుర్తుకువస్తుంది. అదే సమయంలో గంజాయి వాసన గుప్పుమంటుంది. మన్యంలో విస్తారంగా సాగవుతూ దేశవిదేశాలకు గంజాయి తరలిపోతోంది. గిరిజన ప్రజలను అడ్డు పెట్టుకొని గంజాయి గ్యాంగ్ రెచ్చిపోతోంది. గిరి పల్లేలను గంజాయి కేంద్రాలుగా మార్చేశారు.

పసుపు పచ్చని వలిసెపూల అందాలకు, ఆకుపచ్చని కాఫీ తోటల సౌందర్యానికి నిలయం విశాఖ మన్యం. అయితే అడవి అందాల మాటున గంజాయి సాగు ఏటేటా విస్తరిస్తోంది. విశాఖ ఏజెన్సీలో ఒక్కప్పుడు గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే వారు. లేదా కొండకొనల్లో దొరికే అటవీ ఉత్పత్తులను సేకరించి పొట్టపోషించుకునే వారు. కానీ స్మగ్లర్లు వారిని గంజాయి సాగువైపు మళ్లించారు. ఒక్క విశాఖ ఏజెన్సీ ప్రాంతాలంలో 50 వేల ఎకరాల్లో గంజాయి సాగు అవుతోంది.

ఏవోబీ ప్రాంతాలు గంజాయి పంటకు అనుకూలంగా ఉంటుంది. శీలవతి అనే గంజాయికి అత్యధిక రేటు ఉండటంతో స్మగ్లర్లు విశాఖ మన్యంను టార్గెట్‌ చేసుకున్నారు. దక్షిణ భారతంలో గంజాయి రవాణాకు విశాఖ మన్యం అనువైన ప్రాంతం కావడంతో తమిళనాడు, కేరళ నుంచి వచ్చి గిరిజనులతో గంజాయి సాగు చేయిస్తున్నారు. ఏటా 5 వేల కోట్లుకుపైగా గంజాయి స్మగ్లింగ్ జరుగుతోంది. అధికారులు ఎంత పకడ్బంది చర్యలు తీసుకున్న గుట్టు చప్పుడు కాకుండా గంజాయి రవాణా జరుగుతోంది.

పోలీసులు కూడా విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ కొంతవరకు అడ్డుకట్ట వేయగలుగుతున్నా దొరికేదాని కంటే సరిహద్దులు దాటి వెళ్లేదే ఎక్కువ. గంజాయి కేసుల్లో సీజ్ చేసిన గంజాయి పోలిస్, ఎక్సైజ్ శాఖ లో గుట్టగుట్టలుగా పేరుకుపోతోంది. ఈ నేపథ్యంలో మొక్కల స్థాయిలోనే ఎక్సైజ్, పోలిస్ అధికారులు గంజాయి సాగు తోటలను ధ్వంసం చేశారు. దీనిని అరికట్టేందుకు ప్రత్యేంకగా శాటిలైట్ ట్రాకింగ్ ఇమేజ్ సిస్టమ్‌ను అమలులోకి తీసుకురానున్నారు. ‎దీని ద్వారా గంజాయి సాగుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

అడ్డదారిలో అడ్డగోలుగా సంపాదించడానికి అలవాటు పడ్డవారు గంజాయిని అక్రమంగా తరలిస్తూ సోమ్ము చేసుకుంటున్నారు. గంజాయి సాగు మూలాలపై దెబ్బ కొట్టడానికి టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు, గిరిజనుల ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకు చర్యలు తీసుకోవటం మాత్రమే పరిష్కారమని ఇప్పటికే ఉన్నతస్థాయిలో భావించినా అమలులోకి రావటం లేదు. ఆచరణ ప్రారంభమైతే తప్ప మత్తు దిగదని పలువురు అభిప్రాయపడుతున్నారు.


Full View


Tags:    

Similar News