Special Control Room: తాండవపై ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు.. కలెక్టర్ వినయ్ చంద్

Special Control Room: ప్రస్తుతం వరదల నేపథ్యంలో ఎటువంటి పరిస్థితి తలెత్తినా సమస్య లేకుండా ఉండేందుకు ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ వినయ్ చంద్ తెలియజేశారు.

Update: 2020-08-20 13:56 GMT

Collector Vinay Chand

Special Control Room: ప్రస్తుతం వరదల నేపథ్యంలో ఎటువంటి పరిస్థితి తలెత్తినా సమస్య లేకుండా ఉండేందుకు ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ వినయ్ చంద్ తెలియజేశారు. పది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆయ తాండవ నీటిమట్టం గరిష్టస్థాయికి చేరుకోవడంతో ఆయన గురువారం, నర్సీపట్నం సబ్ కలెక్టర్ మౌర్యతో కలిసి ప్రాజెక్టు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వరదల నేపథ్యంలో ఇన్ఫ్లో కొనసాగుతోందన్నారు. దీని గరిష్ట నీటిమట్టం 380అడుగులు కాగా, ప్రస్తుతం 379.1 అడుగులకు చేరిందన్నారు. దీనివల్ల అవసరాన్ని బట్టి నీటిని విడుదల చేయడం జరుగుతుందని, దానికి సంబంధించి కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్టు వివరించారు.

దీంతో పాటు నీటిని విడుదల చేసే సమయంలో ప్రజలను అప్రమత్తం చేసే విధంగా అధికారులను ఆదేశించామన్నారు. కరోనాకు సంబంధించి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు 25 వెంటిలేటర్లను సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. దీంతో పాటు రోగులకు ఆక్సిజన్ అందించేందుకు వీలుగా నాలుగులైన్లు ఏర్పాటు చేసేందుకు రూ.20లక్షలు మంజూరు చేశామన్నారు. అదేవిధంగా కరోనాపై వైద్యం అందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వైరస్ సోకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా, శ్వాస ఇబ్బంది తలెత్తినా వెంటనే కంట్రోల్ రూంకి సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఇక జిల్లాలోని సాగు విషయానికొస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చెప్పిన విధంగా ఈ ఏడాది భగవంతుడు కరుణించడం వల్ల జిల్లాలో సాగు 12 నుంచి 18 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తన్నామన్నారు. దీంతో పాటు రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలను, ఎరువులు అందిస్తున్నామని, వాటిని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్తో పాటు నర్సీపట్నం సబ్ కలెక్టర్ మౌర్య, తాండవ ఎస్ ఈ సూర్యకుమార్, ఢీఈఈ రాజేంద్రకుమార్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.  

Tags:    

Similar News