ఆలయాలకు కార్తికశోభ సంతరించుకుంది. ఈరోజు నుంచి కార్తికమాసం ప్రారంభం కావడంతో శైవక్షేత్రాలన్ని భక్తులతో కళకళలాడుతున్నాయి. కొవిడ్ నిబంధనల కారణంగా స్నానఘాట్లకు అనుమతి రద్దు చేశారు. బెజవాడ దుర్గమ్మ ఆలయాన్ని నేడు గాజులతో అలంకరించనున్నారు. కొవిడ్ నిబంధనలతో అమ్మవారి మూలవిరాట్, ఆలయ ప్రాంగణం వరకే గాజుల అలంకరణ చేయనున్నారు.
కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని పంచారామ క్షేత్రం శ్రీరామలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మహిళలు స్వామి దర్శనం అనంతరం కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు.
పవిత్రమైన కార్తీకమాసం ప్రారంభం తొలి సోమవారం కావడంతో గోదావరి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. గోదావరి తీరంలో శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. రాజమండ్రి- పుష్కరఘాట్, కోటి లింగాల ఘాట్లలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. గోదావరిలో కార్తీకదీపాలు వదిలారు. రాజమండ్రి శ్రీ ఉమామార్కండేయ స్వామి, కోటిలింగేశ్వరస్వామి ఆలయాలలో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సామర్లకోటలో కుమారరామ భీమేశ్వరస్వామి ఆలయంలో ద్రాక్షారామం భీమేశ్వరస్వామి ఆలయాలకు వేకువజాము నుంచే దర్శనాలకు భక్తులు బారులు తీరారు. కొవిడ్‌తో గోదావరి స్నానాలకు భక్తులు తక్కువగానే హాజరయ్యారు.
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షరామం భీమేశ్వరస్వామి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా స్వల్ప సంఖ్యలో భక్తులు దర్శనాలకు వచ్చారు. కార్తీక మాసం సందర్భంగా భీమేశ్వరస్వామిని మంత్రి వేణుగోపాలకృష్ణ దర్శించుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో కార్తీకమాసం సందర్భంగా సామర్లకోటలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వరాలయంలో కార్తీక శోభ మొదలయ్యింది. పిఠాపురం మహారాజా గోత్రనామాలతో తొలిపూజ జరగనుంది. అనంతరం భక్తుల దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు. కార్తీక మాసం సందర్భంగా విశాఖలో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివుడికి భక్తితో అభిషేకాలు చేసి దీపారాధన చేస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా విశాఖ భక్తుల శివనామస్మరణతో మారుమ్రోగుతోంది.