Madanapalle Case:అలేఖ్య మూఢత్వమే శాపంగా మారిందా..? సోషల్ మీడియాలో సంచలన పోస్టులు
మూర్ఖపు పరిణామాలు ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసేశాయి.
మితిమీరిన విశ్వాసం, మూఢనమ్మకం, మూర్ఖపు పరిణామాలు ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసేశాయి. టెక్నాలజీతో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న వేళ.. ఇంకా వెనుకబాటు తనం ఉందని ఆ విద్యావంతుల కుటుంబం రుజువు చేసింది. సభ్య సమాజం కలలో కూడా ఊహించని రీతిలో ఏకంగా కన్న బిడ్డలనే అంధ విశ్వాసంతో కడతేర్చిన ఘటన కన్నీరు తెప్పిస్తోంది. మదనపల్లె క్షుద్రపూజల వ్యవహారంలో వెలుగు లోకొస్తున్న వాస్తవాలు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి.
మదనపల్లి హత్యాకాండ వ్యవహారంలో పెద్దకూతురు అలేఖ్య పాత్రపై సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. లాక్‌డౌన్ సమయంలో అలేఖ్య వ్యవహార శైలి ఒక్కసారిగా మారింది అనడానికి ఆమె సోషల్ మీడియా పోస్టులు సాక్ష్యంగా మారుతున్నాయి. లాక్‌డౌన్ సమయం నుంచీ మొన్నటి అక్కా చెల్లెళ్ల హత్యాకాండ వరకు సోషల్ మీడియాలో అలేఖ్య చేసిన వరుస పోస్టులు ఆమె మానసిక స్థితికి అద్దం పడుతున్నాయి. ఈ నెల 22న తన పేరును మోహినిగా మార్చుకున్నట్లు అలేఖ్య పేర్కొంది. అక్కడితో ఆగకుండా తనని తాను ప్రపంచ సన్యాసినిగా కొత్తగా పరిచయం చేసుకుంది. ఆ తర్వాత శివుడు వస్తున్నాడు.. పని పూర్తయింది అంటూ పలు రకాల పోస్టులు చేసింది.