రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎస్ఈసీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తీసుకోవాల్సిన చర్యలపై అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసేందుకు ఇవాళ ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అంతకంటే ముందు ఎస్ఈసీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గవర్నర్‌ను వేర్వేరుగా కలిసి ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను వివరించనున్నారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నేడు కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ విడివిడిగా కలిసి చర్చించనున్నారు. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు రాజ్ భవన్ లో గవర్నర్ ను కలవనున్న ఎస్ఈసీ ఎన్నికల ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలను వివరించనున్నారు. పలువురు ఐఏఎస్‌లు ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్న విషయాన్ని కూడా గవర్నర్ కు వివరించనున్నారు. ఎన్నికలకు పూర్తిస్థాయి సహకారం అందించేలా ప్రభుత్వాన్ని, ఉద్యోగుల్ని ఆదేశించాలని కోరే అవకాశం ఉంది. ఎస్ఈసీతో సమావేశం ముగిశాక గవర్నర్‌ను సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కలుస్తారు. పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వపరంగా తీసుకుంటున్న చర్యలను వివరించనున్నారు. ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీకి అందిస్తున్న సహకారాన్ని కూడా తెలియజేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.