ఏపీలో పాఠశాలలకు సెలవుల తగ్గింపు.. సంక్రాంతికి మూడురోజులే..
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గతంతో పోలిస్తే కేసుల ఉదృతి తగ్గినా వైరస్ భయం మాత్రం ప్రజల్లో ఆవహించి ఉంది. ఇప్పటికే..
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గతంతో పోలిస్తే కేసుల ఉదృతి తగ్గినా వైరస్ భయం మాత్రం ప్రజల్లో ఆవహించి ఉంది. ఇప్పటికే కరోనా, లాక్ డౌన్ వల్ల విద్యార్థులు ఎక్కువగా నష్టపోయారు. ఇవాల్టినుంచి పాఠశాలలు తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఏపీలోని జగన్ సర్కార్ మాత్రం నవంబర్ 2వ తేదీ నుంచి పాఠశాలలను తెరవాలని నిర్ణయించుకుంది. ఇందుకు తగ్గట్టే విద్యాశాఖ అధికారులు కూడా ఈ విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలండర్ ను సిద్ధం చేసే పనిలో పడ్డారు.
దాదాపు ఐదు నెలల పనిదినాలు తగ్గడంతో జగన్ సర్కార్ అందుకు అనుగుణంగా సిలబస్ లో కూడా మార్పులు చేస్తుంది. సిలబస్ ను తగ్గించడానికి విద్యా శాఖ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. అదే సమయంలో విద్యార్థులకు పండగ సెలవులను కుదించాలని.. అదేవిధంగా ఉపాధ్యాయుల సెలవులపై కూడా పరిమితిని విధించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
వారానికి ఆరు పని దినాలు ఉండే విధంగా ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. సాధారణంగా సంక్రాంతికి పది నుంచి 13 రోజులు సెలవులు ఉండేవి.. కానీ ఈసారి కేవలం మూడు రోజులు మాత్రమే సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 2020 ఏప్రిల్ నెలలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు నెలకు రెండున్నర రోజుల సెలవు దినాలను మాత్రమే వినియోగించుకోవాలి. ఎన్సీఈఆర్టీ సిలబస్ తగ్గిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సిలబస్ ను తగ్గించాలని నిర్ణయించింది.
ఇదిలావుంటే పాఠశాలల హాజరు పట్టికలో ఇకపై కులం, మతం వివరాలు ఉండకూడదని విద్యాశాఖ సంచాలకులు చినవీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థినీవిద్యార్థుల పేర్లను ఒకే రంగు సిరాతో రాయాలని ఆదేశాలు జారీ చేశారు.