విశాఖ జిల్లలో అధికారపార్టీ నేత దెబ్బకు పశువుల శాలగా మారిన పాఠశాల
* స్కూల్ భవనాన్ని పశువుల శాలగా మార్చిన అధికార పార్టీ నేత * స్కూల్ నీటి కుళాయి సొంత అవసరాలకు వినియోగం * వ్యవసాయ ట్రాక్టర్లు, ట్రక్కులకు..పార్కింగ్ స్థలంగా మారిన స్కూల్ ఆవరణ
అంగబలం, ఆర్థిక బలం ఉంటే ఎదురించే వారు ఎవరుంటారు..? దానికి రాజకీయ బలం తోడైతే అడ్డూ అదుపు ఏముంటుంది..? అవును ఇవన్నీ చూసుకునే విశాఖలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఏకంగా పాఠశాల భవనాన్ని పశువులశాలగా మార్చేశాడు. దర్జాగా ఆభవనంలో తన పశువులను ఉంచుతూ.. ఆపాఠశాల పరిసర ప్రాంతాన్ని పార్కింగ్ ప్లేస్‌గా మార్చేశాడు.
అది ఎస్ రాయవరం మండలం. వాకపాడు గ్రామం. ఆఊరిలో విద్యార్థుల కోసం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కానీ.. ఇప్పుడు అది పశువుల శాలగా మారింది. స్కూల్ ఆవరణలో నూతనంగా నిర్మించిన భవనాన్ని అదే గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత పశువుల శాలగా మార్చేశాడు. అంతేకాదు స్కూల్ నీటి కుళాయిని పైపుల ద్వారా సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నాడు.
పాఠశాల ఆవరణను తన వ్యవసాయ ట్రాక్టర్లకు, ట్రక్కులకు పార్కింగ్ స్థలంగా ఉపయోగించుకుంటున్నాడు. ఇది తెలుసుకున్న కొందరు సదరు నాయకుడుని ప్రశ్నించగా... తాను ప్రభుత్వం నుండి కాంట్రాక్ట్ తీసుకుని 5లక్షల 80వేల రూపాయలు పెట్టి భవనం నిర్మించానని చెబుతున్నాడు. అయితే ప్రభుత్వం మాత్రం తనకు లక్షా 50వేల రూపాయల బిల్లు మాత్రమే ఇచ్చిందని చెబుతున్నాడు. మిగిలిన బిల్లు కోసం అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందంటున్నాడు.
దేవాలయంగా భావించే విద్యాలయాన్ని పశువులశాలగా మార్చడంతో చూసిన వారంతా సదరు నాయకుడి తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలబాలకు విద్యాబుద్దులు నేర్పించి రేపటి పౌరులుగా తీర్చిదిద్దబడే పాఠశాల పట్ల విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు 2012-13 సంవత్సరానికి చెందిన సర్వశిక్షా అభియాన్ నిధులపై కూడా డిఈ ఉమామహేశ్వరి విచారణ జరుపుతామన్నారు.
ఇప్పటికైనా వాకపాడు గ్రామంలోని స్కూల్‌పై అధికారులు నిర్లక్ష్యం వీడాలి. సదరు నాయకుడికి రావాల్సిన బిల్లలును కేటాయించాలి. ఇక ఆప్రాథమిక పాఠశాలను విద్యార్థులకు అనుకూలంగా ఉండేటట్లు అక్కడి పరిసరాల్లో మార్పులు చేయాలి.