Sales in Automobiles in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో పుంజుకున్న ఆటోమొబైల్ రంగం !

Update: 2020-07-08 03:46 GMT

sales in automobiles in Andhra Pradesh increased in unlock period : లాక్‌డౌన్‌‌తో కుప్పకూలిన ఆటోమొబైల్ రంగం సడలింపుల తర్వాత ఊహించని విధంగా పుంజుకుంది. వాహనాల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ఫైనాన్స్ సహకారాలు అందకున్నా వాహనాల కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇంతకీ కరోనా కష్టకాలంలో కూడా ఆటోమోబైల్‌ రంగం పుంజుకోవడానికి కారణాలేంటి?.. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై పోతున్న ప్రస్తుత సమయంలో వాహనాలపై ప్రజలకు ఎందుకింత మక్కువ పెరిగింది? 

లాక్‌డౌన్ ప్రారంభం నుంచి మే నెలాఖరు వరకు దేశవ్యాప్తంగా రవాణా రంగం స్తంభించిపోయింది. ఫలితంగా ఆటోమొబైల్ రంగం కుదేలైంది. రెండు నెలలపాటు క్రయ విక్రయాలు ఆగిపోవడంతో ఈ రంగంపై కోలుకోలేని దెబ్బ పడింది. ఈ సంక్షోభం నుంచి బయటపడటం కష్టమనే అనుకున్న తరుణంలో గత పదేళ్ళలో ఎప్పుడూ లేనంతగా జరుగుతున్న కొనుగోళ్లతో ఊపిరి పీల్చుకున్నారు వ్యాపారులు.

లాక్‌డౌన్‌ అనుభవంతో సొంత వాహనం ఉండాలనే భావన ప్రజల్లో పెరిగింది. దీంతో భారీగా వాహనాలు అమ్ముడుపోతున్నాయి. నెల రోజుల్లో ఏపీలో లక్షా 85 వేల వాహనాలు హాట్ కేకుల్లా కొనుగోలయ్యాయంటే.. సొంత వాహనానికి ప్రజలు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో అర్థమవుతోంది.

లాక్‌డౌన్‌ తర్వాత కరోనా భయంతో పది మందితో కలిసి ప్రయాణం అంటేనే జనం సందేహిస్తున్నారు. దీనికి తోడు ఉన్నట్టుండి లాక్‌డౌన్ విధిస్తే ఎక్కడ రవాణా ఆగిపోతుందో అన్న భయం సగటు ప్రయాణికుల్లో నెలకొంది. ఇవన్నీ ప్రజానీకాన్ని సొంత వాహనాల కొనుగోలు వైపు మళ్ళించాయి. కొందరు ఆస్తులు అమ్మి మరీ వాహనాలను కొనుగోలు చేయటం ప్రతీ ఇంటికి వాహనం నిత్యావసరంగా మారిందని చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తోంది. దీంతో కరోనా సమయంలో వాహనాల కొనుగోళ్ళు విపరీతంగా పెరిగిపోయాయంటున్నారు వ్యాపారులు. కరోనా ప్రజల జీవనంలో తీసుకొచ్చిన మార్పులకు పెరిగిన వాహనాల కొనుగోళ్లు ఉదహరణగా నిలుస్తున్నాయి.

Full View


Tags:    

Similar News