ఆమె వాగ్దాటి చూసి, తెలుగుదేశం ఆమెను నెత్తినపెట్టుకుంది. పార్టీలోకి వచ్చిన కొద్దిటైంలోనే ఆమెకు అధికార ప్రతినిధి హోదాను కట్టబెట్టింది. పార్టీలో కొందరు వద్దంటున్నా వారించి, ఆమెకు మంచి గౌరవమిచ్చింది. అయితే, ఇప్పుడామె అవిన్నీ పక్కనపెట్టి, కండువా మార్చుకునేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. దీంతో అప్పుడప్పుడే వచ్చినవారిని, నెత్తినపెట్టుకుంటే, ఇలాగే వుంటుందని టీడీపీలో కొందరు మహిళా నేతలు, సీనియర్లు రగిలిపోతున్నారట. ఇంతకీ సైకిల్ దిగబోతున్న ఆ ఫైర్ బ్రాండ్ లీడర్ ఎవరు ఏ పార్టీలోకి జంప్ కాబోతున్నారు?
సాదినేని యామిని. ఫైర్ బ్రాండ్ లీడర్. టీడీపీలో ఒక వెలుగు వెలిగిన మహిళా నేత. విమర్శలు, ప్రతివిమర్శలతో తక్కువ కాలంలోనే పేరు తెచ్చుకున్న నాయకురాలు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, టీవీ చర్చావేదికలు, అనేక బహిరంగ సభల్లో ఆమె కనపడని రోజులేదు ఆమె వాగ్దాటి వినపడని రోజులేదు. టీడీపీ తరపున స్ట్రాంగ్ వాయిస్ వినిపించారు సాదినేని యామిని. జగన్, పవన్‌ల మీద సాదినేని యామిని ఫైర్ బ్రాండ్‌గా చెలరేగిపోవడంతో, తెలుగుదేశం కూడా అనతికాలంలోనే ఆమెకు మంచి పదవులే ఇచ్చింది. అధికార ప్రతినిధిగా ఆమెను నియమించింది. ఏళ్లుగా పార్టీలో వుండి, పని చేస్తున్న నేతలను కాదని, అప్పుడప్పుడే పార్టీలోకి వచ్చిన సాదినేని యామినిని, అధికార ప్రతినిధిగా అపాయింట్ చేసింది తెలుగుదేశం. చంద్రబాబు, లోకేష్‌లు ఆమెను ఎంతగానో ప్రోత్సహించారు. సాదినేని యామిని తండ్రి చనిపోయినప్పుడు, స్వయంగా చంద్రబాబు నాయుడు, ఆమెను పరామర్శించి, అన్ని విధాలా అండగా ఉంటామని హామి ఇచ్చారు. పార్టీ ఇంతగా ఆమెను చేరదీసినా, ఆదరించినా, ఒక అసెంబ్లీ సీటు, ఆమెను అసహనానికి గురి చేసిందట. చివరికి పార్టీకి దూరమయ్యేట్టు చేసిందట.
ఎన్నికలకు ముందు వైసీపీ, బీజేపీని విమర్శించడంలో టీడీపీ కీలక నేతలతో పోటీపడ్డ సాదినేని యామిని ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో ఓ అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. తన సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండే స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఆ సీటును టీడీపీ మరో నేతకు కేటాయించడంతో ఆమె నిరాశ చెందారు. అప్పటి నుంచి పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా పార్టీ మారాలని ఆమె డిసైడయ్యారన్న చర్చ జోరుగా వినిపిస్తోంది.
కొంతకాలంగా ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణతో యామిని చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే ఆమె బీజేపీలో చేరబోతున్నారని గుంటూరు జిల్లా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికలైన తర్వాతనే ఆమె బీజేపీలోకి వెళ్లాలని చాలా ప్రయత్నాలు చేశారని తెలిసింది. అయితే అప్పట్లో చంద్రబాబు రంగంలోకి దిగి బుజ్జగించడంతో యామిని కాస్త మెత్తబడ్డారు. కానీ, మళ్లీ ఆమె బీజేపీలోకి వెళ్లాలని డిసైడయ్యారు. ఈ నెల 10న అధికారికంగా బీజేపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. యామినికి పార్టీ అధికార ప్రతినిధి ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
అయితే, ఎన్నికలకు ముందు యామిని చేసిన కొన్ని వ్యాఖ్యలు, కలకలం రేపాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యక్తిగత కామెంట్లు సంచలనం అయ్యాయి. పవన్‌పై మల్లెపూల కామెంట్, ఆయన పెళ్లిళ్ల వ్యవహారంపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు యామిని. ఈ కామెంట్లపై టీడీపీ అధినేత చంద్రబాబు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. అధికార ప్రతినిధిని చేసినంత మాత్రాన, ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదని హెచ్చరించారట. అయితే, పార్టీలోకి వచ్చిన కొద్దికాలంలోనే ఆమెను నెత్తినపెట్టుకున్నారని, అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, అందుకే ఆమె ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, కొందరు సీనియర్లు కూడా బాబుతో అన్నారట. అందుకే ఆమె ఎంత అడిగినా, అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదని, ఆమె చేసిన వ్యాఖ్యలే ఆమెకు శాపంగా మారాయని, తెలుగుదేశం నేతలు మాట్లాడుకున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో, మొన్నటి వరకు తనకెంతో గౌరవం ఇచ్చిన పార్టీలోనే, తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని సహించలేకపోతున్న యామిని, పార్టీని వీడాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
బీజేపీలోకి చేరడానికి మరిన్ని కారణాలు కూడా ప్రచారంలో వున్నాయి. యామిని అధికార పార్టీలో వుండాలని భావిస్తున్నారని, అప్పుడు పవర్‌లో వున్న టీడీపీలో చేరారని, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీలో చేరాలనుకుంటున్నారని, కొందరు టీడీపీ నేతలు మాట్లాడుకుంటున్నారట. మొత్తానికి టీడీపీ బలమైన వాయస్‌గా పని చేసిన సాదినేని యామిని, త్వరలో కమలం తీర్థం పుచ్చుకుంటారన్న చర్చ మాత్రం బాగా నడుస్తోంది. కీలకమైన నేతల సమక్షంలోనే ఆమె పార్టీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.