Sachivalayam Exams 2020: ఏడు రోజుల పాటు సచివాలయ పరీక్షలు.. రేపటి నుంచే ప్రారంభం

Sachivalayam Exams 2020 | ఏపీలో రేపటి నుంచి జరగనున్న సచివాలయ ఉద్యోగాలకు ఎంపిక పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగులకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది..

Update: 2020-09-19 02:18 GMT

Sachivalayam Exams 2020 | ఏపీలో రేపటి నుంచి జరగనున్న సచివాలయ ఉద్యోగాలకు ఎంపిక పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగులకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది... పరీక్ష సమయంలో అభ్యర్థులు అవస్థలు పడకుండా రవాణా సౌకర్యం సైతం కల్పించింది. వీటితో పాటు ప్రస్తుతం కరోనా వ్యాధి తీవ్రంగా ప్రబలి ఉన్నందువల్ల అది సోకిన వారికి పరీక్షలు రాసేలా అవకాశం కల్పించింది. ఇంతవరకు ఏ పరీక్షకు కరోనా లక్షణాలుంటే పరీక్ష రాయకుండా నిషేదం ఉండేది. దానికి భిన్నంగా ఈ లక్షణాలుంటే పరీక్షలు రాసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి సమస్య తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేసింది.

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆదివారం నుంచి రాతపరీక్షలు మొదలు కానున్నాయి. ఈసారి మొత్తం 16,208 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏడు రోజుల పాటు రోజుకు రెండేసి చొప్పున మొత్తం 14 రకాల రాతపరీక్షలను నిర్వహించనున్నారు. రోజూ ఉదయం పది గంటలకు, మధ్యాహ్నం రెండున్నర గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయి. కరోనా నేపథ్యంలో పరీక్ష రాసే అభ్యర్థులందరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తారు. ఉదయం పరీక్ష రాసేవారు 8 గంటల కల్లా, సాయంత్రం పరీక్ష రాసేవారు ఒంటి గంట కల్లా పరీక్ష కేంద్రం వద్ద రిపోర్ట్‌ చేయాలని అధికారులు తెలిపారు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి మించి ఒక్క నిమిషం లేటుగా వచ్చినా పరీక్ష హాల్లోకి అనుమతించబోమన్నారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉన్నప్పటికీ తెలుగు అనువాదం కూడా ఉంటుందని చెప్పారు. తప్పుగా గుర్తించిన జవాబులకు నెగిటివ్‌ మార్కులుంటాయన్నారు.

పరీక్షల తర్వాత కూడా బస్సులు

విజయవాడ, విశాఖపట్నంలలో శనివారం నుంచి సిటీ సర్వీసులు అందుబాటులోకి వస్తున్నట్లు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. శుక్రవారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షల అనంతరం కూడా సిటీ బస్సులు నడుపుతామన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారు సైతం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలు రాసేలా ప్రతీ కేంద్రంలో ప్రత్యేకంగా ఐసోలేషన్‌ పరీక్ష రూమ్‌ ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

ఐసోలేషన్‌ రూమ్‌లో ఇన్విజిలేషన్‌ బాధ్యతలు నిర్వహించే వారికి పీపీఈ కిట్లతోపాటు ఆ గదిలో వీడియో రికార్డింగ్‌ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న రాత పరీక్షల ఏర్పాట్లపై మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.

హాల్‌టికెట్‌లో ఫొటో స్పష్టంగా లేకుంటే..

► మొత్తం 10,56,391 మంది పరీక్షలు రాస్తుండగా.. అందులో 6,81,664 మంది తొలిరోజునే పరీక్షకు హాజరవుతారు. శుక్రవారం సాయంత్రం వరకు 8,72,812 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌

చేసుకున్నారు. హాల్‌టికెట్‌లో ఫొటో స్పష్టంగా లేకున్నా, బ్లాక్‌ అయిన ఫొటో, చాలా చిన్న సైజులో ఫొటో, సంతకం లేని ఫొటో ఉంటే అభ్యర్థులు గెజిటెడ్‌ ఆఫీసర్‌తో సంతకం చేయించుకున్న మూడు ఫొటోలు వెంట తెచ్చుకోవాలి. హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు కూడా తప్పనిసరి.

► ఓఎంఆర్‌ షీట్‌లో బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌తో మాత్రమే జవాబులు నింపాల్సి ఉంటుంది. పెన్సిల్, ఇంక్‌ పెన్, జెల్‌ పెన్‌తో నింపకూడదు.

► కరోనా అనుమానిత లక్షణాలున్న వారు రాతపరీక్షకు హాజరయ్యేందుకు వీలుగా ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక ఐసోలేషన్‌ రూమును అధికారులు ఏర్పాటు చేశారు. ఈ రూముల్లో ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లను అందజేస్తారు.

► అభ్యర్థులకు మాస్కులు, హ్యాండ్‌ శానిటైజర్లు తప్పనిసరి. పరీక్ష సమయంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే పరీక్ష కేంద్రం అధికారుల దృష్టికి తెచ్చి ఐసోలేషన్‌ రూముకు వెళ్లాలి.  


Tags:    

Similar News