AP Election 2024: ఏపీలో రికార్డ్ స్థాయిలో పోలింగ్‌.. ఏయే జిల్లాల్లో ఎంత శాతం నమోదైందో తెలుసా?

AP Election 2024: రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ ఎత్తున ఓటింగ్ జరగడం ఇదే తొలిసారి

Update: 2024-05-15 03:45 GMT

AP Election 2024: ఏపీలో రికార్డ్ స్థాయిలో పోలింగ్‌.. ఏయే జిల్లాల్లో ఎంత శాతం నమోదైందో తెలుసా?

AP Election 2024: ఏపీ ప్రజలు ప్రజాస్వామ్య స్పూర్తిని చాటారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో రికార్డ్ స్థాయి పోలింగ్ శాతం నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 82.37 శాతం పోలింగ్ నమోదైంది. 2014లో 78.90 శాతం, 2019లో 79.80 శాతం నమోదు కాగా.. ఈసారి రికార్డ్ స్థాయిలో 82.37 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంత భారీ ఎత్తున ఓటింగ్‌ జరగడం ఆంధ‌్రప్రదేశ్ చరిత్రలో ఇదే తొలిసారి. ఓవైపు మండే ఎండలు.. మరోవైపు వేడిగాలులు, ఉక్కపోతను సైతం లెక్క చేయలేదు. గంటల కొద్దీ క్యూ లైన్‌లో నిల్చుని.. ఓటు వేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో 2009లో జరిగిన ఎన్నికల్లో 72.63%, 2014లో 78.90%, 2019లో 79.80% మేర పోస్టల్‌ బ్యాలట్‌ కలిపి పోలింగ్‌ నమోదైంది. ఆ లెక్కన చూస్తే ప్రాథమిక అంచనాల ప్రకారం ఈసారి 2009తో పోలిస్తే 9.74%, 2014తో పోలిస్తే 3.47%, 2019తో పోలిస్తే 2.57% మేర అధికంగా ఓటింగ్‌ జరిగినట్టు తెలుస్తుంది. మొత్తంగా 81.30% మేర ఓటింగ్‌ నమోదైనట్లు అనధికారిక అంచనా. పోస్టల్‌ బ్యాలట్‌ ఓటింగ్‌ 1.07 శాతాన్ని దీనికి కలిపితే మొత్తం పోలింగ్‌ 82.37% ఉండొచ్చనేది ప్రాథమిక లెక్క. క్షేత్రస్థాయి నుంచి పూర్తి వివరాలు వచ్చాక వాటన్నింటినీ క్రోడీకరించి ఎన్నికల సంఘం అధికారిక గణాంకాల్ని ప్రకటించనుంది. ఆ వివరాలు విడుదలయ్యాక పోలింగ్‌ శాతంపై పూర్తి స్పష్టత రానుంది.

పోలింగ్ రోజు అర్ధరాత్రి 2 గంటల వరకూ 47కు పైగా కేంద్రాల్లో పోలింగ్‌ కొనసాగింది. రాష్ట్రంలో ఈసారి మొత్తం 4,14,01,887 మంది ఓటర్లు ఉండగా.. అందులో 4,44,218 మంది పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా ఓటుహక్కు వినియోగించుకున్నారు. భారీ ఎత్తున పోలింగ్ జరటంతో.. ఓటింగ్ సరళిపై ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్ష పార్టీలు సైతం లెక్కలు వేసుకుంటున్నాయి. భారీ స్థాయిలో నమోదైన ఓటింగ్ వల్ల ఎవరికి లబ్ది చేకూరుతుందనే అంశంపై అధికారపార్టీలో.. ప్రతిపక్ష పార్టీలో చర్చలు కొనసాగుతున్నాయి. గుంటూరు, నెల్లూరు, కర్నూలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో.. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు ఓట్ల మార్పడి జరిగిందనే ప్రచారం జరుగుతోంది. క్రాస్ ఓటింగ్ ఎన్ని నియోజకవర్గాల్లో జరిగి ఉండొచ్చని విషయమై నేతల పార్టీలు ఆరా తీస్తున్నారు.

2019లో పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా 2,95,003 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. అప్పటి కంటే 2024లో అదనంగా 1,49,215 మంది ఓటర్లు పోస్టల్‌ బ్యాలట్‌‌తో ఓటు వేశారు. అత్యధికంగా డా.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 83.19శాతం, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 63.19శాతం పోలింగ్‌ నమోదైంది. 10 జిల్లాల్లో 80 శాతానికి పైగా పోలింగ్‌ జరిగింది. 14 జిల్లాల్లో 75 నుంచి 79.41 శాతం మధ్య పోలింగ్‌ నమోదైంది. రెండు జిల్లాల్లోనే 63 నుంచి 66శాతం మధ్య ఓటింగ్‌ జరిగినట్టు తెలుస్తుంది. కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని కురవళ్లి గ్రామంలోని 109 పోలింగ్ కేంద్రంలో వంద శాతం పోలింగ్ నమోదైంది. ఈ పోలింగ్ కేంద్రంలో మొత్తం 940 మంది ఓటర్లు ఉండగా.. అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నట్టు అధికారుల తెలిపారు.

హింస రహిత, రీ పోలింగ్ లక్ష్యంగా ఈసీ చర్యలు తీసుకుంది. ఈసీ చర్యలతోనే ఓటర్లు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. ఎప్పుడూ లేని విధంగా ఇతర రాష్ట్రాల్లో సెటిల్ అయినవాళ్లు కూడా.. సొంతూళ్లకు వచ్చి ఓటేయటంతో.. భారీ ఎత్తున ఓటింగ్ శాతం నమోదైంది. ఎన్నడూ లేని విధంగా ఉత్కంఠను రేపిన సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. నేతల భవిత్యం... ఈవీఎంలో నిక్షిప్తం అయ్యింది. ఇక ఓట్ల లెక్కింపు మాత్రమే మిగిలి ఉంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగనుండగా.. ఫలితాలపై నేతలతో పాటు ఏపీ మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

Tags:    

Similar News