కోనసీమ కొట్లాట ఎందుకు మొదలైంది? అంబేడ్కర్ కోనసీమ జిల్లా పేరు మార్పు ఎందుకు తెరపైకి వచ్చింది?

Konaseema - Amalapuram: అమలాపురం ఆందోళన దారి తప్పిందా? ప్రీ ప్లానా? పాలక, ప్రతిపక్షాలు రాజకీయకోణంలో ఆలోచిస్తున్నాయా?

Update: 2022-05-25 06:13 GMT

కోనసీమ కొట్లాట ఎందుకు మొదలైంది? అంబేడ్కర్ కోనసీమ జిల్లా పేరు మార్పు ఎందుకు తెరపైకి వచ్చింది?

Konaseema - Amalapuram: కోనసీమ జిల్లా కాలుతోంది. అంబేద్కర్ జిల్లాగా పేరు మార్చడంపై జిల్లావాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో అమలాపురంలో నిరసనలకు దిగిన ఆందోళనకారులు మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లకు నిప్పు పెట్టారు. స్కూల్, ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వ భవనాలు, పోలీసు వాహనాలను కాల్చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. వాహానాలను ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించారు. 

పోలీసులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొన్నది. పరిస్థితి అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు సైతం జరిపారు. దీంతో అమలాపురంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనల్లో స్థానికులతోపాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర గాయాల పాలయ్యారు. ‎హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. నేటి నుంచి అమలాపురంలో కర్ఫ్యూ విధించారు. ఆందోళనాకారులను అదుపు చేసే పనిలో ఎక్కడికక్కడ ఆంక్షలు అమలు విధించారు.

కోనసీమ జిల్లా మార్పుపై అమలాపురంలో అర్థరాత్రి వరకు ఉద్రిక్తత కొనసాగింది.. హింసాత్మక ఘటనల నేపథ్యంలో.. అక్కడి పరిస్థితి పొలిటికల్ టర్న్ అగ్గికి ఆజ్యం పోసినట్లైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబులు బయటకు వచ్చి మాట్లాడాలని.. వెనుకాల ఉండి.. ప్రజలను రెచ్చగొట్టడం కాదంటూ వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ ఈఆందోళనలకు మరింత ఆజ్యం పోశాయి. ప్రతివిషయాన్ని రాజకీయం చేసే ప్రతిపక్షాలు సెన్సిటీవ్ ఇష్యూ లో రెచ్చగొట్టి తమషా చూస్తున్నారని వైసీపీ నేత సజ్జల ఇతర నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డుతున్నారు. ఈ గొడవల వెనుక ముమ్మాటికీ చంద్రబాబు హస్తం ఉందని ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉంటే కోనసీమ పేరు మార్పు గొడవలకు ముమ్మాటికీ ప్రభుత్వ పనితీరు వైఫల్యమే కారణమంటున్నారు విపక్ష నేతలు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్ష పార్టీలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్ష నేత టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు,జనసేనాని పవన్ లు మండిపడ్డారు. ఇటు బీజేపీ సైతం.. లేని వివాదాన్ని ప్రభుత్వం క్రియేట్ చేస్తోందని ఆరోపణలు గుప్పిస్తోంది. పేరు మార్పుపై ఇప్పటికే అక్కడ హింసాత్మక ఘటనల నేపథ్యంలో అధికార విపక్ష నేతల మధ్య మాటలతో ఈ గొడవలు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి.

ఇదే సమయంలో కోనసీమ సాధన సమితి మరో నిరసనకు పిలుపునిచ్చింది. బుధవారం ఉదయం 10 గంటలకు అమలాపురం కలెక్టరేట్ సమీపంలోని నల్ల వంతెన దగ్గరకు భారీగా ప్రజలు చేరుకోవాలని, నిరసన చేపట్టాలని తెలిపింది. ప్రస్తుతం వారి మాటలు చూస్తుంటే వెనక్కు తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో బుధవారం ఏం జరుగుతుందనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక కోనసీమలో తాజా పరిస్థితులపై ఏపీ హోంశాఖ అప్రమత్తమైంది. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు జిల్లాకు అదనపు బలగాలను పంపింది. ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు అమలాపురం చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

ఆందోళనకారులను నిలువరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అమలాపురంలో 144 సెక్షన్ విధించిన పోలీసులు ఉన్నతాధికారుల.. మొత్తం 600 మంది అదనపు బలగాలను మోహరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే.. చర్యలు తప్పవని డీఐజీ పాలరాజు తెలిపారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే కోనసీమలో హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిని సీసీ ఫుటేజీల ద్వారా గుర్తిస్తామంటున్న ఆయన.. ఘటన వెనుక ఏయే శక్తులు ఉన్నాయే అందరినీ బయటకు తీస్తామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News