నల్లమలను దహించేస్తున్న అగ్నిమంటలు.. మానవ తప్పిదమా? అధికారుల నిర్లక్ష్యమా?
Nallamala Forest: 20 రోజుల్లో దాదాపు 30 ప్రాంతాల్లో ఘటనలు...
Nallamala Forest: అడవిలో అగ్ని.. ఎటు చూసినా పచ్చని చెట్లు.. సెలయేళ్లు.. అడవి జంతువులు.. పక్షుల కిలకిల రావాలతో అలరారే నల్లమల అటవీ ప్రాంతంలో.. వేసవి వచ్చిందంటే చాలు.. ఏదొక మూలన మంటలు చెలరేగి అడవి సంపద కాలిబూడిదౌతూనే ఉంటోంది. ఈ అగ్నిప్రమాదాలకు అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యమా? లేక సంఘ విద్రోహ చర్యలు కారణమో తెలియదు కానీ.. అడవి మాత్రం కాలిపోతోంది. దీంతో వన్యప్రాణులు విలవిలలాడుతున్నాయి.
నల్లమల అటవీ ప్రాంతాన్ని గత కొన్నేళ్లుగా అగ్నిజ్వాలలు పట్టిపీడిస్తున్నాయి. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ఎక్కడ.. ఏ మూలన మంటలు చెలరేగుతాయో.. ఎన్ని ఎకరాల అటవి సంపద అగ్నికి ఆహుతి అవుతుందో చెప్పలేని పరిస్థితి. దీంతో అడవిలో ఉండే జీవ రాసుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎన్నొరకాల వన్యప్రాణిలు కూడా అగ్నికి ఆహుతౌతున్నాయి. ఈ 20 రోజుల్లో దాదాపు 30 ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఎక్కడ చిన్న అగ్గి రాజుకున్నా అడవంతా విస్తరిస్తూ ప్రమాదకరంగా మారుతుంది.
రాత్రి సమయాల్లో చూస్తే గుట్టలపై దీపాల వరుసలాగా మంటలు రేగుతుండడంతో చెంచులు భయాందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 7.73 లక్షల ఎకరాల్లో అటవీ భూమి విస్తరించి ఉంది. నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలో నల్లమల ప్రాంతమే 6.17 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉంది. అయితే.. అడవులు కాలడానికి ముఖ్య కారణం తునికాకు సేకరణకు ముందు ప్రూనింగ్ కు బదులు అడవులను కాల్చుతుంటారనే ఆరోపణలు ఉన్నాయి.
అడవుల్లో తిరిగే వ్యక్తులు బీడీలు తాగి వాటిని ఆర్పేయకుండానే పడేయడం వల్ల నేర వేప, దేవదారు, నల్లమద్ది వంటి గట్టి చెట్లకు నిప్పంటుకుని.. చెట్టుకు చెట్టు తాకడం వల్ల కూడా మంటలు వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదు. నల్లమల అటవీ ప్రాంతంలో 1.75 లక్షల హెక్టార్లలో పులుల అభయారణ్యం ఉంది. ఈ ప్రాంతంలో 17 నుంచి 25 వరకు పులులు, వందకు పైగా చిరుతలు, వందల సంఖ్యలో జింకలు, ఎలుగుబంట్లు, కుక్కలు, సాంబర్లు, కొండగొర్రెలు, అడవిపందులు, నెమళ్లు, మనుబోతులు, కోతులు, మచ్చల జింకలు ఉన్నాయి.
అడవిలో మంటలు చెలరేగడంతో ఈ వన్యప్రాణులు విలవిలలాడుతున్నాయి. మరోవైపు.. అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు అంటున్నారు. ఇందుకోసం ఫైర్ వాచర్లకు వాహనాలు, మంటలను అదుపుచేసే పరికరాలు అందించామంటున్నారు.