Andhra Pradesh: ఏపీలో ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన
Andhra Pradesh: * ఉ.11:01 నిమిషాలకు శంకుస్థాపన కార్యక్రమం * రూ.77 కోట్లతో ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులు * టీడీపీ హయాంలో తొలగించిన దేవాలయాల పునర్నిర్మాణం
ఏపీలో టీడీపీ హయాంలో తొలగించిన దేవాలయాల పునర్నిర్మాణానికి ఏపీ సీఎం జగన్ ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. విజయవాడలో పై వంతెన నిర్మాణం కోసం గత ప్రభుత్వ హయాంలో తొలగించిన దేవాలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇవాళ ఉదయం 11:01 నిమిషాలకు ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. దక్షిణముఖ ఆంజనేయస్వామి, సీతమ్మవారి పాదాలు, రాహు-కేతువు, బొడ్డుబొమ్మ, గోశాల కృష్టుడి ఆలయం, కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. 77 కోట్లతో ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనుల శంకుస్థాపనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఏపీలో తాజాగా చోటు చేసుకున్న ఆలయాల విధ్వంసం, విగ్రహాల ధ్వంసం ఘటనలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో తిరిగి భక్తుల్లో విశ్వాసం నింపడంతో పాటు విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇప్పటికే గుళ్ల వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఎవరినీ లెక్కచేయొద్దని ఆదేశాలు ఇచ్చిన జగన్ , తాజాగా పలు ఆలయాల పునర్ నిర్మాణానికీ శ్రీకారం చుట్టారు.
గతంలో చంద్రబాబు ప్రభుత్వం విజయవాడలో కృష్ణా పుష్కరాల ఏర్పాట్ల పేరుతో పలు ఆలయాలను తొలగించింది. వీటిని పునర్ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో గతంలో కూల్చివేసిన, దెబ్బతిన్న ఆలయాల పునరుద్ధరణ చర్యలు సైతం చేపడుతుంది. దీంతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న టీడీపీకి, బీజేపీకి ఒకేసారి చెక్ పెట్టొచ్చని జగన్ సర్కార్ భావిస్తోంది.
మొదట తాడేపల్లి నుంచి బయలు దేరి విజయవాడ దుర్గమ్మను దర్శించుకోనున్నారు. అనంతరం ఆలయాల పునర్నిర్మాణ భూమిపూజ జరిగే ప్రదేశానికి వెళ్లనున్నారు. గుళ్ల పునర్మిణానికి శ్రీకారం చుట్టనున్నారు.