AP Weather: చల్లటి కబురు.. ఏపీకి వర్షసూచన
AP Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడే ఛాన్స్
AP Weather: అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. ఇది సముద్రమట్టానికి 4.5 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ అధికారులు చెప్పారు. ఈ ఉపరితల ఆవర్తనం వాయువ్య దిశగా కదలుతూ.. ఈ నెల 20 నాటికి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా బలపడే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.
మండే ఎండలు, ఉక్కపోత దెబ్బకు అల్లాడిపోతున్న ఏపీ ప్రజలకు చల్లని కబురు వచ్చేసింది. మళ్లీ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తనున్నాయని చెప్పింది వాతావరణ శాఖ. అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని..ఇది సముద్రమట్టానికి 4.5 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ అధికారులు చెప్పారు.
ఈ ఉపరితల ఆవర్తనం వాయువ్య దిశగా కదలుతూ..ఈ నెల 20 నాటికి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా బలపడే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఏపీలో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చునని వాతావరణ శాఖ పేర్కొంది.
రాబోయే మూడు రోజుల్లో కోస్తాంధ్ర రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే ఈ నెల 23 నుంచి అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి చిరుజల్లులు కురిసే అవకాశముంది. మరో ఐదురోజుల్లో నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడం..అలాగే అల్పపీడనంతో ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అవి వస్తే ఒక్కసారిగా రాష్ట్రంలో వర్షాలు ఊపందుకుంటాయని వాతావరణ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే.. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా.. ఆపై వాయుగుండంగా.. ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా బలపడితే.. ఈ నెల 25వ తేదీ కల్లా.. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలకు తుఫాన్ గండం పొంచి ఉండొచ్చునని ఐఎండీ అంచనా వేస్తోంది. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది.