ఏపీ పాలిటిక్స్‌లో RRR ఎపిసోడ్.. ఊహించని ట్విస్ట్‌లతో చివరి నిమిషంలో టికెట్.. కట్‌చేస్తే.. భారీ మెజారిటీతో గెలుపు..!
ఏపీ పాలిటిక్స్‌లో RRR ఎపిసోడ్... సినిమాను తలపించింది.
ఏపీ పాలిటిక్స్‌లో RRR ఎపిసోడ్... సినిమాను తలపించింది. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. అసలు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో తెలియదు.. చివరి నిమిషంలో టీడీపీ టికెట్ దక్కించుకున్న రఘురామకృష్ణరాజు భారీ మెజారిటీతో గెలుపొందారు.
ఏపీ రాజకీయాల్లో రఘురామకృష్ణరాజు సంచలనాలు సృష్టించారు. ఆయన వైసీపీలో ఉన్నప్పుడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సీఎం జగన్ మోహన్‌రెడ్డిపై ఎప్పటికప్పుడు విరుచుకుపడుతూనే వచ్చారు. రఘురామ ఎన్నికల ముందు వైసీపీని వీడారు. తాను మరోసారి నరసాపురం ఎంపీగా గెలుస్తానని ధీమాగా చెప్పుకొచ్చారు. అయితే టీడీపీ-బీజేపీ రఘురామకు టికెట్ విషయంలో ఊహించని షాక్ ఇచ్చాయి. ఆయనకు సభ్యత్వమే లేదని రెండు పార్టీలు చెప్పడంతో షాక్ అయ్యారు రఘురామ.
బీజేపీ తరపున రఘురామ బరిలో ఉంటారని అంతా భావించారు. అయితే రఘురామకు బీజేపీ నుంచి స్పందన రాలేదు. రఘురామకు బీజేపీ టికెట్ కేటాయించకపోవడానికి జగనే కారణమన్న చర్చ సాగింది. వైసీపీ నేతలకు కొరకరాని కొయ్యగా మారిన రఘురామ తాను ఏ పార్టీలో లేనంటూ ప్రకటించారు. ఆ తర్వాత టీడీపీ కూటమి నుంచి ఎంపీ అభ్యర్థిగా కచ్చితంగా బరిలో దిగుతానని స్వయంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే పాలకొల్లులో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరి ఉండి నుంచి బరిలో దిగారు.
రఘురామకృష్ణరాజు రాజధాని అమరావతి విషయంలో తొలి నుంచి ఆయన పోరాటం చేశారు ఆయనపై దాడి జరిగినా వెనక్కి తగ్గలేదు. ఏపీకి అమరావతినే రాజధానిగా ఉండాలని పోరాటం చేశారు. ఒక రకంగా వైసీపీకి దూరంగా ఉండటానికి కూడా రాజధాని అంశమే ప్రధాన కారణం. అమరావతి రాజధాని కోసం పోరాటం చేసిన రైతులు, ఆ ప్రాంతవాసులకు సైతం అండగా నిలిచారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అమరావతినే రాజధాని అంటూ హామీ ఇస్తూ ప్రచారం చేశారు. రఘురామకృష్ణరాజు హామీలను నమ్మిన ఉండి ప్రజలు భారీ మెజారిటీని కట్టబెట్టారు.
ఉండి టికెట్ పొందడం నుంచి గెలుపు వరకు రఘురామకు అనేక ట్విస్ట్‌లు చోటుచేసుకున్నాయి. ఉండిలో మంతెన రామరాజుకు మొదట టీడీపీ టికెట్ కేటాయించింది. తర్వాత రఘురామ కృష్ణరాజుకు చంద్రబాబు టీడీపీ టికెట్ కేటాయించింది. ఆ తర్వాత రఘురామకు టీడీపీ టికెట్ కేటాయించింది. దీంతో అలిగిన మంతెన రామరాజును చంద్రబాబు బుజ్జగించారు. ఉండి టీడీపీ టికెట్ ఆశించి భంగ పడ్డ శివరామరాజు ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేశారు. ఆయన బరిలో ఉండటంతో టీడీపీ ఓట్లు గణనీయంగా చీల్చడంతో రఘురామ గెలుపుపై ప్రభావం చూపుతాయని భావించారు. అయితే ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్ సర్వేలో రఘురామ గెలుస్తారని తేల్చింది.
వైసీపీ అభ్యర్థి వెంకట లక్ష్మీ నరసింహరాజుపై 56,777 ఓట్ల భారీ మెజారిటీతో విజయదుందుభి మోగించారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థికి 60,125 ఓట్లు రాగా, ఆర్ఆర్ఆర్‌కు 1,16,902 ఓట్లు వచ్చాయి. ఉండిలో ఘన విజయం అందుకున్న రఘురామకృష్ణరాజును స్పీకర్‌గా నియమిస్తారనే ప్రచారం నడుస్తోంది.