Pulichintala: తెలుగురాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా పులిచింతల గేట్‌ ఘటన

Pulichintala: 16వ గేటు విరిగిపోవడంతో దిగువకు భారీగా వరద ఉధృతి * పులిచింతల నిర్మాణంలో ఆది నుంచి లోపాలేనంటున్న నిపుణులు

Update: 2021-08-06 04:57 GMT

విరిగిన పులిచింతల ప్రాజెక్ట్ గేట్ (ఫైల్ ఇమేజ్)

Pulichintala: పులిచింతల ప్రాజెక్ట్ గేటు ఊడిపోయిన ఘటన.. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గేటు విరిగిపోవడంతో దిగువకు వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. తాత్కాలిక గేటు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు అధికారులు. ఇదిలా ఉంటే.. పులిచింతల నిర్మాణంలో ఆది నుంచీ లోపాలే ఉన్నాయని, డిజైన్‌ ఖరారు మొదలుకొని పనుల వరకూ అన్నింటిలో సమస్యలేనని నిపుణులు చెబుతున్నారు. లోపాలను సవరించే ప్రయత్నం చేయకపోవడంతోనే గేటుకు నష్టం వాటిల్లిందని అభిప్రాయపడుతున్నారు.

నీటి పారుదలశాఖ సమాచారం ప్రకారం పులిచింతలలో 24 గేట్ల నిర్మాణం జరగ్గా, ఒక్కొక్కటి 18.5/17 మీటర్లు. అన్ని గేట్లూ ఇలా ఉంటేనే సమతౌల్యం దెబ్బతినకుండా నీటి ఒత్తిడిని భరించే శక్తి గేట్లకు ఉంటుంది. కానీ.. ఇక్కడ అందుకు భిన్నంగా ఒక గేటుకు ఇంకో గేటుకు పొంతన లేదన్నది నిపుణుల అభిప్రాయం. గేట్లను అమర్చడానికి నిర్మించే పియర్స్‌లో ఒక గేటుకు, ఇంకో గేటుకు మధ్య గ్యాప్‌ గరిష్ఠంగా ఆరు మిల్లీమీటర్లకు మించి ఉండరాదు. కానీ పులిచింతలలో 400 మిల్లీమీటర్లకు పైగా ఉందని ప్రాజెక్ట్‌ను పరిశీలించిన నిపుణులు చెబుతున్నారు.

45.77 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 2005లో పులిచింతల ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభమయ్యాయి. ఒప్పందం ప్రకారం 12వందల 89 మీటర్ల కాంక్రీటు డ్యాం నిర్మాణం, ఇందులో 754.59 మీటర్ల దూరం స్పిల్‌వే నిర్మాణాన్ని 33 గేట్లతో చేపట్టాలి. అయితే ఈపీసీ పేరుతో డ్యాం డిజైన్‌ మార్చి.. స్పిల్‌వేను 546 మీటర్లకు తగ్గించడంతో గేట్ల సంఖ్య 24కు తగ్గింది. కాంక్రీటు డ్యాం బదులు 355 మీటర్ల మట్టికట్ట నిర్మాణం చేపట్టారు. దీంతో గేట్ల మధ్య దూరం భారీగా పెరిగింది. ఘటనకు ఇదే ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. ఇప్పటికైనా అన్ని గేట్లను నిశితంగా పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News