Mekapati Goutham Reddy: రిమోట్ వర్క్ పై అవకాశాలు కల్పించండి.. పారిశ్రామికులకు మంత్రి సూచన
Mekapati Goutham Reddy: ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది.
Mekapati Goutham Reddy: ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది... వ్యాక్సిన్ సైతం మరో నాలుగైదు నెలల ఆగితేనే కాని వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇది అందుబాటులోకి వచ్చినా దేశ ప్రజలందరకీ ఇవ్వాలంటే మళ్లీ నెలల కాలం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలకు వెళ్లి ఉపాధి చేసుకోవాలంటే కుదరని పని, దీన్ని అధికమించేందుకు రిమోట్ వర్క్ విధానం ద్వారా ఏమైనా అవకాశాలుంటే కల్పించేందుకు పరిశ్రమలు ప్రయత్నం చేయాలని ఏపీ పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లో 'రిమోట్ వర్క్' కాన్సెప్ట్ అవకాశాలపై అధ్యయనం చేయాలన్నారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. ఈ మేరకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ, ఐఎస్‌బీ ప్రతినిధులతో గురువారం సమీక్ష నిర్వహించారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మంత్రి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. కోవిడ్-19 నేపథ్యంలో స్వగ్రామం, స్వస్థాలలో ఉద్యోగాలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు మంత్రి గౌతమ్ రెడ్డి. పరిశ్రమ, కంపెనీ ఎక్కడున్నా ఇంటి నుంచే విధులు నిర్వర్తించడమే 'రిమోట్ వర్క్' కాన్సెప్ట్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిశ్రమలలో 'రిమోట్ వర్క్' కు ఉన్న అవకాశాలను పరిశీలించాలి అన్నారు. రిమోట్ వర్క్‌కు అనుగుణంగా ఇంట్లోంచి విధులు నిర్వర్తించగల 'నైపుణ్యం'పైనా అధ్యయనం చేయాలన్నారు. స్థానికంగా ఉన్న యువతకు ఇతర ఉపాధి అవకాశాలపైనా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు గౌతం రెడ్డి.
పరిశ్రమలలో ఉద్యోగాలు, గ్రామీణ యువత ఆలోచనలను అధ్యయనం చేసే బృందం ఏర్పాటు చేశామన్నారు గౌతం రెడ్డి. పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ఐఎస్‌బీల సభ్యులు ఈ బృందంలో ఉంటారన్నారు. పరిశ్రమల శాఖ, నైపుణ్య శాఖల నుంచి ఒక్కొకరిని నోడల్ అధికారిగా నియమిస్తున్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము, పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ అర్జా శ్రీకాంత్, ఐ.టీ సలహాదారులు లోకేశ్వర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హనుమ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమావేశమయ్యారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితి, అభివృద్ధి పనులపై చర్చించారు. అంతకు ముందు ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం మండలంపైనా మంత్రి గౌతమ్ రెడ్డి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.