Projects Restoration: సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ పనులు షురూ.. రెండు, మూడు విడతల్లో రూ. 778 కోట్లు కేటాయింపు
Projects Restoration: సాగునీటి ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. అవసరమైన మేర కొత్త ప్రాజెక్టులు నిర్మాణం చేయడం, పాత వాటికి సంబంధించి పునరుద్ధరణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది
Projects Restoration: సాగునీటి ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. అవసరమైన మేర కొత్త ప్రాజెక్టులు నిర్మాణం చేయడం, పాత వాటికి సంబంధించి పునరుద్ధరణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది... దీనికి సంబంధించి ఇప్పటికే సంబంధిత అధికారులు ప్రణాళికలు చేయగా, పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ. 778 కోట్ల నిధులు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ నిధులతో పూర్తిస్థాయిలో పునరుద్ధరణ చేసి, వచ్చే ఖరీఫ్ నాటికి సక్రమంగా సాగునీటిని అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది.
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ, అభివృద్ధి (డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్) రెండు, మూడో విడత అమలుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం కింద రూ.778 కోట్ల వ్యయంతో 31 సాగునీటి ప్రాజెక్టుల్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచించింది. పథకం అమలు కోసం ప్రత్యేకంగా స్టేట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (ఎస్పీఎంయూ) ఏర్పాటు చేసి బడ్జెట్‌లో రూ.5 కోట్లను ఫిబ్రవరి 25న మంజూరు చేసింది. పథకం అమలును పర్యవేక్షించడానికి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మాజీ అధ్యక్షుడు ఏబీ పాండ్య అధ్యక్షతన డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ (డీఎస్‌ఆర్‌పీ)ని ఏర్పాటు చేసింది. 2020–21 నుంచి పథకం అమలుకు శ్రీకారం చుట్టనుంది.
చేపట్టే పనులివీ..
► ఈ పథకం కింద సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి అవసరమైన నిధుల్లో.. 70 శాతాన్ని ప్రపంచ బ్యాంకు రుణం, కేంద్ర ప్రభుత్వం వాటాగా ఇస్తాయి. మిగతా 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి.
► జలాశయాల స్పిల్ వే నుంచి నీరు లీకవుతుంటే.. వాటిని అరికట్టడానికి గ్రౌటింగ్ (స్పిల్ వేపై బోరు బావి తవ్వి.. అధిక పీడనంతో కాంక్రీట్ మిశ్రమాన్ని పంపడం ద్వారా స్పిల్ వే పునాదిలో ఏర్పడిన పగుళ్లను మూసివేయడం) చేస్తారు. లీకేజీలు మరీ అధికంగా ఉంటే స్పిల్ వేకు జియో మెంబ్రేన్ షీట్ అమర్చుతారు.
► స్పిల్ వే గేట్లను ఎత్తడానికి దించడానికి వీలుగా ఏర్పాటు చేసిన హాయిస్ట్‌లకు మరమ్మతులు చేస్తారు. గేట్లు పూర్తిగా పాడైతే.. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తారు.
► వాటి నిర్వహణ నిమిత్తం నిధులను సమకూర్చుకోడానికి జలాశయాల్లో చేపల పెంపకం, పర్యాటక అభివృద్ధి పనులు చేపడతారు.
నిధులు రాబట్టని గత సర్కార్
► దేశంలో సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ, అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహకారంతో 2015లో కేంద్ర ప్రభుత్వం డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్ (డ్రిప్)ను ప్రారంభించింది. మొదటి దశలో ఏడు రాష్ట్రాల్లోని 198 ప్రాజెక్టులను రూ.3,467 కోట్లతో అభివృద్ధి చేసింది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రానికి కేంద్రం ఒక్క పైసా కూడా కేటాయించలేదు.
► 'డ్రిప్' రెండు, మూడు దశలను ఈ ఏడాది జూన్ నుంచి కేంద్రం అమలు చేస్తుండగా.. రాష్ట్రానికి సింహభాగం నిధులు రాబట్టి జలాశయాలను అభివృద్ధి చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.
► 'డ్రిప్' రెండో దశలో రాష్ట్రంలో 31 జలాశయాల అభివృద్ధికి రూ.778 కోట్లను మంజూరు చేయాలంటూ సీడబ్ల్యూసీకి రాష్ట్ర జల వనరుల శాఖ ప్రతిపాదనలు పంపింది.
► రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు సీడబ్ల్యూసీ ఆమోద ముద్ర వేసి ఈ ఆర్థిక సంవత్సరంలోనే నిధులు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది.