పలు కేసుల్లో జైలుకు వెళ్లే నిందితులను కాటేస్తోన్న కరోనా వైరస్

నేరారోపణలతో పలు కేసుల్లో జైలుకు వెళ్లే నిందితులను కరోనా కాటేస్తోంది.

Update: 2020-06-25 08:55 GMT

నేరారోపణలతో పలు కేసుల్లో జైలుకు వెళ్లే నిందితులను కరోనా కాటేస్తోంది. జైలుకు వచ్చిన తర్వాత పాజిటివ్ రిపోర్టులు వస్తుండడంతో అధికారులు, సిబ్బంది హడలిపోతున్నారు. శిక్ష పడిన ఖైదీలతో పాటు రిమాండ్ కు వచ్చే వారికి కరోనా విషయంలో నిర్ధిష్టమైన ఆదేశాలు లేకపోవడం.. తప్పనిసరిగా జైలుకు తరలించాల్సి వస్తుండడంతో పోలీసులు, జైలు సిబ్బందిలోనూ ఆందోళన మొదలైంది.

అనంతపురం జిల్లాలో జైలు అధికారులకు, సిబ్బందికి ఇప్పుడు కరోనా భయం పట్టుకుంది. ప్రస్తుతం జిల్లా జైలులో 114 మంది వరకూ ఖైదీలు ఉన్నారు. ఇటు సబ్ జైళ్లలో 185 మంది వరకు ఉన్నారు. అయితే పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వాళ్లను ప్రతి రోజూ విచారణ నిమిత్తం వివిధ జైళ్లకు తరలిస్తుంటారు అధికారులు. అయితే ఈ మధ్య జైలుకు వెళ్తున్న ఖైదీలకు కూడా కరోణా లక్షణాలు బయటపడుతుండడం ఇప్పుడు సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది.

ఈ నెల 12వ తేదీన జిల్లా జైలుకు వచ్చిన ఓ రిమాండ్ ఖైదీకి కరోనా లక్షణాలు బయటపడడంతో వెంటనే అతడ్ని ఐసోలేషన్ కు తరలించారు. జైలు ఉన్న బుక్కరాయసముద్రం రెడ్డిపల్లి ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు. ఇక అప్పటి నుంచి జైలుకు కొత్త వారిని తీసుకెళ్లడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. ఇటు కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో మార్చి నుంచే ఖైదీలతో ములాకత్ ను కూడా నిలిపి వేశారు. అంతేకాదు కరోనా నివారణకు అన్నిచర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు జైలు అధికారులు.

జిల్లా వ్యాప్తంగా పలు సబ్ జైళ్లలో కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఖైదీలను కోవిడ్ కేర్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారం కిందట గుత్తి సబ్ జైలులో ఇద్దరు ఖైదీలకు కరోనా పాజిటివ్ రావడంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత హిందూపురం సబ్ జైలుకు తీసుకెళ్లిన 10 మంది నిందితుల్లో ఒకరికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఆ తర్వాత మరో ఇద్దరు మళ్లీ మరో నలుగురు కరోనా వైరస్ బారిన పడ్డారు. కొత్తగా జైలుకు వెళ్లే నిందితుల విషయంలో ప్రభుత్వం నుంచి, కోర్టుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేనందున తప్పని పరిస్థితుల్లో వారిని జైలులోకి అనుమతించాల్సి వస్తోందని అయినా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నారు అధికారులు.

కరోనా వైరస్ లేదని తేలితేనే జైళ్లలోకి అనుమతించాలని రాజస్థాన్ లో హైకోర్టు తీర్పు అమల్లో ఉందని ఇప్పటికే హర్యానా ప్రభుత్వం జీవో కూడా జారీ చేసిందని గుర్తు చేస్తున్నారు జైలు అధికారులు. ఏపీ ప్రభుత్వం కరోనా విషయంలో ఖైదీలు, జైళ్ల సిబ్బంది ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నిర్ధిష్టమైన ఆదేశాలు ఇవ్వాలని జైళ్లశాఖ అధికారులు, సిబ్బంది కోరుతున్నారు. 

Tags:    

Similar News