రామాయపట్నం పోర్టుపై ప్రకాశం జిల్లా వాసుల్లో అసంతృప్తి
* సాలిపేట పంచాయితీలో నిర్మాణమవుతోన్న పోర్టు * నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పరిశ్రమలకు భూసేకరణ * పోర్టు మా భూముల్లో.. ఉపాధి మరో జిల్లాకు అంటూ ఆగ్రహం * ప్రభుత్వ తీరుపై మండిపడుతోన్న విపక్షాలు, స్థానికులు
దశాబ్దాల కల సాకారమయ్యే వేళ ఆ ప్రయోజనం దక్కుతుందా లేదా అనే ప్రశ్న ప్రకాశం జిల్లా వాసులను కలవరపెడుతోంది. భూమి తమదైతే.. ఉద్యోగాలు మాత్రం వేరే జిల్లాకు వెళ్తాయా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామాయపట్నం పోర్టు విషయంలో ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరుతున్నారు.
రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అడుగులు పడుతున్నా.. ప్రకాశం జిల్లా వాసుల్లో ఆందోళన నెలకొంది. పోర్టు మాత్రమే జిల్లాలో ఉండి అభివృద్ధి అంతా నెల్లూరు జిల్లాకు వెళ్లేలా తీసుకుంటున్న చర్యలు వారిని కలవరానికి గురిచేస్తున్నాయి. గుడ్లూరు మండల పరిధిలోని సాలిపేట, రావూరు, చేవూరు పంచాయతీల పరిధిలో మాత్రమే పోర్టు కోసం భూములు సేకరించాలని ఉన్నతస్థాయి నుంచి అధికారులకు ఆదేశాలు అందగా మిగిలిన భూములన్నింటినీ నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో సేకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
సాలిపేట పంచాయతీ పరిధిలో పోర్టు ఏర్పాటు జరగనుండగా.. అందుకు ప్రాథమికంగా 802 ఎకరాలు సేకరిస్తున్నారు. పోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యే నాటికి మొత్తం 3,420 ఎకరాలు కావాలని పోర్టు అధికారులు జిల్లా అధికారులకు తెలిపారు. రావూరు, చేవూరుల పరిధిలో మొత్తం 3,773 ఎకరాలు సేకరిస్తున్నారు. ఆ భూమిలో పోర్టు అవసరాలు తీరాక మిగిలింది పరిశ్రమలకు వినియోగించుకోవచ్చని పోర్టుల సీఈఓ భూసేకరణ ప్రక్రియ ప్రారంభించారు. అందులో 2 వేల 618 ఎకరాలు పోర్టుకు వినియోగించనుండగా.. మిగిలిన 1,155 ఎకరాల్లో పోర్టు కోసం ఖాళీ చేయిస్తున్న గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాలని అధికారులు ఆలోచిస్తున్నారు.
మరోపక్క పొరుగునే ఉన్న నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పరిశ్రమల కోసం ఏపీఐఐసీ ద్వారా 6,500 ఎకరాలు సేకరించేందుకు ఆ జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన పరుగులు తీస్తోంది. దీంతో పోర్టు ఇక్కడ పరిశ్రమలు అక్కడా అంటూ ప్రకాశం జిల్లా వాసులు మండిపడుతున్నారు. అయితే ఇటీవల జరిగిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చిన సందర్భంలో.. పోర్టుని కూడా నెల్లూరు జిల్లా పరిధిలోకి మార్చుకుందామని అక్కడ ప్రజాప్రతినిధులు అన్నట్లు తెలుస్తోంది. దీంతో భూములిచ్చిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే కందుకూరులో రామాయపట్నం పోర్టు భూసేకరణ కోసం చేపట్టిన సమీక్షా సమావేశంలో ఈ విషయంపై కలెక్టర్ కూడా విస్మయం వ్యక్తం చేశారు. జిల్లాకు జరగబోతున్న అన్యాయం గురించి ప్రభుత్వానికి నివేదిస్తానని తెలిపారు. అయితే భూసేకరణ ప్రక్రియతో సంబంధం లేకుండా టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ఒత్తిడి ఉండటంతో.. డిసెంబర్ 6,7 తేదీల్లోనే టెండర్లు స్వీకరించే అవకాశాలున్నాయి. ఈ స్థితిలో ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు కూడా పోరాడితేనే జిల్లా అభివృద్ధికి నాంది పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. dissatisfieddissatisfied