రసవత్తరంగా ప్రకాశం జిల్లాలోని పంచాయతీ ఎన్నికలు

Update: 2021-02-05 11:31 GMT

 Panchayati Elections

రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఆయా పంచాయతీలకు కొన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఎన్నికల్లో తమ మద్దతుదారులను గెలిపించుకోవడానికి అక్కడి పార్టీల నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. దీంతో ప్రతిసారీ గెలుపోటములు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతుంటాయి. దీనంతటికీ కారణం ఆయా పంచాయతీలు ప్రముఖ రాజకీయ నాయకుల ఇలాకాలు కావడమే. 2013లో సత్తా చాటిన టీడీపీ ఈసారి కూడా వాటిని దక్కించుకుంటుందా లేక వైసీపీ పాగా వేస్తుందా అనేది తొలి దశలో జరగనున్న ఎన్నికల్లో తేలిపోనుంది.

ప్రకాశం జిల్లాలోని టంగుటూరు మండలం కొణిజేడు గ్రామం రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్వగ్రామం. ఆగ్రామంలో దాదాపు 5 వేల జనాభా ఉన్నారు. 2013 ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారు గుమ్మా నారాయణమ్మ ఇక్కడ గెలుపొందారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఈ గ్రామం నుంచి తొమ్మిది మంది సర్పంచి పదవికి నామినేషన్లు వేశారు. వీరిలో తమ మద్దతుదారు గెలుపును మంత్రి ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఈసారి ఎవరు గెలుస్తారనే ఆసక్తి ఇక్కడ నెలకొంది.

టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం లో స్థానిక కొండపి టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి స్వగ్రామం. దాదాపు 2500 మంది జనాభా ఉన్న ఆ గ్రామంలో గత ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ మద్దతుదారు కోటేశ్వరమ్మ గెలుపొందారు. ఈ పంచాయతీ సర్పంచి గానే టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు రాజకీయ జీవితాన్ని ఆరంభించి మంత్రిగా, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చక్రం తిప్పారు. ప్రస్తుతం ఆక్కడ 8 నామినేషన్లు దాఖలయ్యాయి. గతంలో మాదిరిగానే టీడీపీ మద్దతుదారు గెలుస్తారా? లేక అధికార పార్టీ ప్రాబల్యం చూపుతుందా అనే ఉత్కంఠ అక్కడ నెలకొంది.

మార్టూరు మండలం కోనంకి.... పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్వగ్రామం. ఆక్కడ దాదాపు 6 వేల జనాభా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారు జొన్నలగడ్డ ఏసుపాదం విజయం సాధించారు. ప్రస్తుతం ఇక్కడ నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ఈసారి ఎవరు గెలుస్తారో తెలియాలంటే ఈ నెల 9వ తేదీ వరకు వేచిచూడాల్సిందే.

పర్చూరు నియోజకవర్గంలోని యద్దనపూడి అద్దంకి టీడపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ స్వగ్రామం. ఇక్కడ దాదాపు 5వేల మంది జనాభా ఉన్నారు. గత ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ మద్దతుదారు కనపర్తి జగదేశ్వరి గెలుపొందారు. ఈసారి 9 నామినేషన్లు దాఖలుకాగా సాగనున్న పోరుపై స్థానికంగా చర్చ జరుగుతోంది.

ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలోని కొణిజేడు, తూర్పునాయుడుపాలెం, కోనంకి, యద్దనపూడి పంచాయతీల్లో అధికార, ప్రతిపక్షాల నాయకులు తమ మద్దతుదారులను గెలిపించుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. జిల్లా ప్రజలు దృష్టి ఆయా పంచాయతీల పోరు పైనే ఉంది.

Tags:    

Similar News