సార్వత్రిక సమరంలో తెలుగురాష్ట్రాల్లో మహాఘట్టం ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసింది. పలు చోట్ల మినహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియగా... సమస్యాత్మక కేంద్రాల్లో 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. మిగతా చోట్ల సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. అయితే క్యూ లైన్లలో ఉన్న ఓటర్లకు అధికారులు ఓట్లు వేసేందుకు అనుమతిస్తున్నారు. మిగతా చోట్ల పార్టీ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలకు సీల్ ఎన్నికల అధికారులు సీల్ వేశారు. ఎన్నికల ప్రచారాలతో హోరెత్తించిన నాయకుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం అయింది. జూన్ 4న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
ఏపీలో ఇవాళ జరిగిన పోలింగ్ సరళిని పరిశీలిస్తే... సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో నాలుగో విడతలో ఎన్నికలను ఈసీ నిర్వహించింది. లోక్‌సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి సైతం ఎన్నికలను అధికారులు నిర్వహించారు. ఉదయం 7 గంటలకే పలు చోట్ల ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు బారులు తీరారు. ఉదయం 9 గంటల వరకు 9.22 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఈసీ తెలిపింది. 11 గంటల వరకు 23.10 శాతం, మధ్యాహ్నం ఒంటి గంటకు 40.26 శాతం, మధ్యాహ్నం 3 గంటల వరకు 55.49 శాతం పోలింగ్ నమోదవగా..సాయంత్రం 5 గంటల వరకు 68 శాతం పోలింగ్ నమోదైంది. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత... క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. పోలింగ్ శాతం పెరిగే అవకాశాలున్నాయని ఎన్నికల అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి పులివెందుల భాకరాపురంలోని 138 పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఉండవల్లిలో ఓటు వేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరిలోని పోలింగ్ బూత్‌కు తన భార్యతో కలిసి చేరుకుని ఓటు వేశారు. రాజమహేంద్రవరంలోని వీఎల్ పురంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఓటు వేశారు.
గుంటూరు జిల్లా తెనాలి, పల్నాడు జిల్లా మాచర్ల, అనంతపురంలో జరిగిన సంఘటలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దాడులకు పాల్పడిన వారిపై గృహనిర్బంధంతో పాటు కేసులు పెట్టాలని ఈసీ ఆదేశించింది. పుంగనూరులో నిందితులను వదిలేసిన ఎస్‌ఐని సస్పెండ్ చేయాలని ఆదేశించింది.
ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈమేరకు టీడీపీ అధినేత చంద్రబాబు రాసిన లేఖతో పాటు మరో 11 ఫిర్యాదులను మాజీ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ ఈసీకి అందజేశారు. ఉదయం నుంచి రాష్ట్రంలో 120కి పైగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.