గాన గంధర్వుడి పురస్కారాలపై రాజకీయమా? తన స్వరంతో తెలుగు నేలను పులకరింపజేసిన మధుర గాయకుడి అవార్డులపై పొలిటికల్ వ్యూహాలా? దక్షిణాదినే కాదు ఉత్తరాదినీ తన గాత్రంతో అలరించిన గ్రేట్ సింగర్‌పై, మైలేజీ స్ట్రాటజీలా? బాలసుబ్రమణ్యం అకాల మరణంలోనూ రాజకీయం వెతుక్కుంటోంది ఎవరు?
బాలు పేరిట పురస్కారాలు ఇవ్వాలంటూ బాబు డిమాండ్ చేశారు. ఆయన మరణవార్త మరుసటి రోజే ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. చంద్రబాబు డిమాండ్ తర్వాతిరోజే భారతరత్న ఇవ్వాలని పీఎంకు సీఎం లెటర్ పంపారు. గాన గంధర్వుడి పురస్కారాలపై రాజకీయమా? చంద్రబాబు మైలేజీ వ్యూహం బెడిసికొట్టేలా జగన్ అదిరిపోయే స్ట్రాటజీ వేశారన్న చర్చేంటి?
ఏపీలో 40 ఇయర్స్ ఇండస్ట్రీగా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపించే ఏకైక పేరు టిడిపి అధినేత చంద్రబాబుదే. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఆయన తనదైన మార్క్ చూపిస్తూనే ఉంటారు. చేసేపనికి రెట్టింపు మైలేజ్ రావాలన్న తపన ఆయనకు మాత్రమే సొంతం అని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అప్పట్లో ఆయన ఏం చేసినా సంచలనమే. హైటెక్ సిటీ నుండి అమరావతి కేపిటల్ సిటీ వరకూ జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పేరు సంపాదించారు. బిల్ గేట్స్ నుండి బిల్ కలెక్టర్ల వరకూ తనదైన క్రేజ్ తో అందరినీ ఆకట్టుకున్నారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో ఉమ్మడి రాష్ట్రంలోనూ, విభజన తర్వాతి నవ్యాంధ్రప్రదేశ్ లోనూ తనదైన ముద్రను వేసుకున్నారు చంద్రబాబు.
అయితే ఇంతటి చరిత్ర కలిగిన చంద్రబాబు, రాజకీయ వ్యూహరచనలో ఎంతో దిట్ట అన్నది రాజకీయ విమర్శకుల మాట. తన పొలిటికల్ స్ట్రాటజీలతో జాతీయస్థాయి ఇమేజ్ పొందిన చంద్రబాబు, మొన్నామధ్య ప్రధాని పదవికి రేసులో ఉన్నట్లు వినిపించారు. జాతీయనేతలతో మంతనాలు జరుపుతూ కనిపించారు. అయితే ఇదంతా గడచిన చరిత్ర. వర్తమానం మాత్రం ఆయన నాయకత్వంపై ఎన్నో అనుమానాలను రేపుతోంది. వ్యూహరచనలో దిట్ట అయిన చంద్రబాబు కొంతకాలంగా ట్విట్టర్ పిట్టలవరకూ, జూమ్ మీటింగ్ ల వరకే ఆగిపోతున్నారు. కరోనా వల్ల కంగారు పడ్డారా..? ఆరోగ్యం దెబ్బతింటుందని ఆందోళన పడ్డారో తెలియదు కానీ, కొంతకాలంగా ఆయన వ్యూహం మసకబారింది. స్ట్రాటజీల లక్ష్యం మిస్సయ్యి పార్టీకి డ్యామేజీలు గా మారుతున్నాయి. మరోవైపు తనయుడు లోకేష్ వైపు నుండి, నేనున్నా నాన్నా అన్న భరోసా ఇంకా పూర్తిగా రాకపోవటంతో పార్టీ శ్రేణులు నడిపించే నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలోనే ఉంటే భవిష్యత్తు ఉండదేమోనన్న అనుమానంతో కొందరు తట్టాబుట్టా సర్దేసుకోగా ఇంకొంతమంది గోడదూకేందుకు స్టూళ్లు చేతపట్టకుని సిద్ధంగా ఉన్నారు.
ఇదంతా ఒక ఎత్తయితే ప్రధాన ప్రతిపక్షంగా టిడిపి ఆశించిన స్థాయిలో పనిచేయటం లేదన్నది విమర్శకుల మాటే కాదు, సొంతపార్టీ నేతల మాట కూడా. ఏడాదిగా ఆ పార్టీ పనితీరును చూసిన సొంత నేతలే పెదవి విరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అధికారంలో ఉన్నపుడు ఒకలా విపక్షంలో ఉన్నపుడు మరోలా వ్యవహరించటం పార్టీ నిబద్ధతను, నిజాయితీని ప్రశ్నిస్తోందన్నది వారి వాదన, ఆవేదనా అట. ఇందుకు తాజాగా గానగంధర్వుడు బాల సుబ్రమణ్యం అకాల మరణం తర్వాత, పార్టీ నుంచి చేసిన డిమాండ్లు కూడా సహేతుకంగా లేవన్నది నేతల మాటల సారాంశంగా కనిపిస్తోంది. అధినేత చంద్రబాబు ఈ అంశంపై రాసిన లేఖ కూడా పార్టీ అంతర్గత వర్గాల్లో చర్చగా మారిందట. బాల సుబ్రమణ్యానికి ఘనమైన నివాళి పలకాలంటే పార్టీ నుంచి ప్రభుత్వానికి ఆ స్థాయిలో డిమాండ్లు వినిపించాలనీ, కానీ మనం చేసిన పని ఆ స్థాయిలో లేదన్నది సదరు నేతల మాట అట. బాలు పేరిట నెల్లూరు లో సంగీత విశ్వవిద్యాలయం నెలకొల్పాలి ఆయన కాంస్యవిగ్రహం ఏర్పాటు చేయాలి, బాలు జయంతిని రాష్ట్ర పండుగలా చేయాలి, జాతీయ పురస్కారం ఏర్పాటు చేయాలి ఇదీ ఆయన రాసిన లేఖ సారాంశం. అంతా బాగానే ఉంది. కానీ ఈ డిమాండ్ ఆయన రాసిన లేఖలో ఒక ఐదు లైన్లు ఉంటే టిడిపి హయాంలో కళాకారులకు తామేం చేశామో చెప్పటానికే రెండు పేజీలు పట్టింది. దీంతో ఇష్యూ ఏదైనా సొంత డబ్బా మాత్రం ఓ రేంజ్ లో వినిపించటం మనకు మాత్రమే చెల్లిందన్న సెటైర్లూ వినిపిస్తున్నాయట.
బాలు తెలుగు కీర్తి. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ ఎంతో పేరున్నా, నెల్లూరు జిల్లా వాస్తవ్యుడు. అచ్చ తెలుగు మహా మనిషి. ప్రభుత్వంలో ఎవరున్నా, ఆయన పేరు మీద అవార్డులు, రివార్డుల వంటివి ఏవో చేస్తారు. సంగీత కళాశాలకో, మరో దానికో ఆయన పేరు కూడా పెడతారు. అయితే, సర్కారు వారు అలా చేస్తారేమో, ముందే ప్రకటిస్తారేమోనన్న ఆలోచనో, ముందస్తుగానే బాలు పేరిట చాలా డిమాండ్లు పెట్టారు బాబు. అదీ కూడా బాలు చనిపోయాడని తెలిసిన మరుసటి రోజే. బాబుకు ఇంత తొందరెందుకన్నది బాలు అభిమానుల విమర్శ. ఇందులో బాబుగారి తనదైన మైలేజీ స్ట్రాటజీ వుందన్నది విశ్లేషకుల మాట. ముందే అవార్డులను డిమాండ్ చేయడం ద్వారా, ప్రభుత్వం అవే ప్రకటిస్తే, ఇదిగో తాను చెప్పినందుకే పాలకులు ప్రకటించారని క్రెడిట్ కొట్టేయొచ్చన్నది వ్యూహం కావచ్చు. ఒకవేళ చెయ్యకపోతే, ఇదిగో తెలుగు ఖ్యాతిని నలుదిశలా చాటిన గాన గంధర్వుడిని ప్రభుత్వం అసలు పట్టించుకోలేదని విమర్శలు చేయొచ్చన్న మైలేజీ మతలబేమో. అధికారంలో వున్నదీ ఒక రాజకీయ పార్టీనే కాబట్టి, చంద్రబాబుకే క్రెడిట్ వస్తుందని పురస్కారాలేవీ అనౌన్స్ చెయ్యకపోతే. అందుకు చంద్రబాబే బాధ్యత వహించాలంటున్నారు బాలు అభిమానులు. బాలు సింపతీలో రాజకీయ లబ్ది కోసం, ఇలా ముందస్తు రిజర్వేషన్‌లకు చంద్రబాబు ఆత్రమేంటన్న విమర్శలు అభిమానుల నుంచి వస్తున్నాయి.
దీంతో బాలు ఎపిసోడ్ ను కూడా మన బాసు వదల్లేదురా బాబోయ్ అంటూ తెలుగు తమ్ముళ్లు మొఖాలు చూసుకుంటున్నారట. ఇంత పెద్ద లెటర్ రాసి బాలు విషయంలో, ఆయనకు ఘననివాళి పలకడంలో మనమే ముందున్నామని కాలర్ పైకెగరేసే లోపు, ముఖ్యమంత్రి జగన్ నుండి బైర్లు కమ్మే ప్రకటన వచ్చేసింది. చంద్రబాబు తనకు రాసిన లేఖ ఇంకా మడతవిప్పారో లేదో కానీ బాలూకు భారతరత్న ఇవ్వాలని ప్రధాని మోడీకి లేఖ రాసి, బాబు గారి స్ట్రాటజీని మాత్రం మడత పెట్టేశారు జగన్. దీంతో వ్యూహం అంటే ఇదే శభాష్ జగన్ అన్న గుసగుసలు సైతం సర్వత్రా వినిపించాయి. అలాగే ఈమధ్య ముఖ్యమంత్రి జగన్ 40 ఇయర్స్ ఇండస్ట్రీకి, 10 ఇయర్స్ ఇండస్ట్రీకి మధ్య తేడా చూపిస్తున్నారనీ, చాలా అంశాల్లో టిడిపి షాకిచ్చేలా జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న కామెంట్లు సైతం పొలిటికల్ సర్కిల్స్ లో తెగవినిపిస్తున్నాయట. దీంతో డైలమాలో పడ్డ తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు జూమ్ లో సెపరేట్ మీటింగ్స్ పెట్టుకుని బావురుమంటున్నారట. బాలు పురస్కారాలపైనా రాజకీయమేంటని అసహనంగా వున్నారట కార్యకర్తలు. మరి బాబు గారూ ఇప్పటికైనా మారాల్సిందే మీరు లేదంటే వన్ సైడ్ అవుతుందేమో పోరు ఓ లుక్కేయండి మీరు అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.