Jagan: ఎన్నికల్లో వ్యూహాలకు పదునుపెడుతున్న సీఎం జగన్
Jagan: ఇన్నిరోజులు ఒక ఎత్తు.. ఇప్పటినుంచి మరో ఎత్తన్న జగన్
Jagan: ఎన్నికలకు ఆర్నెళ్లు ముందుగానే ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికారమే లక్ష్యంగా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు ఏపీ సీఎం జగన్. ఇన్ని రోజులు ఒక ఎత్తు.. ఇప్పటి నుంచి మరో ఎత్తు. ఇక గేర్ మార్చాల్సిన అవసరం ఉంది. గడప గడపకు మన ప్రభుత్వం సమీక్షలో పార్టీ లీడర్లను ఉద్దేశించి సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వై నాట్ 175 అంటూ ముందు నుంచీ తన పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్న జగన్.. ఇప్పుడు గేర్ మార్చాలని సూచించారు. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అంటూ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని... ఎమ్మెల్యేలకు దిశా నిర్ధేశం చేశారు జగన్. ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని... వై నాట్ 175 అనే నినాదం సాధ్యమేనన్నారు. కొంచెం కష్టపడితే గెలవొచ్చనే ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు.. రాబోయే కాలంలో చేపట్టే కార్యక్రమాలు మరో ఎత్తు అని నేతలకు జగన్ సూచించారు.
వచ్చే 6 నెలలు ఎలా పనిచేస్తామన్నది చాలా ముఖ్యమని.. గేర్ మార్చాల్సిన సమయం వచ్చేసిందని దిశానిర్దేశం చేశారు. పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల క్షేత్రస్థాయిలో సానుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇదే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని సూచించారు. పార్టీ నేతలకు దిశానిర్దేశం వెనుక ఉన్న జగన్ లక్ష్యమేంటి అనేది చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు అరెస్టు తర్వాత పరిణామాలను అనుకూలంగా మార్చుకోవడానికి సీఎం జగన్ రచిస్తున్న వ్యూహాలేంటి అనేవి ఆసక్తిని కలిగిస్తున్నాయి.