కడపలో హీటెక్కుతోన్న రాజకీయం.. పులివెందులలోనే మకాం వేయనున్న సీఎం జగన్ సతీమణి భారతి
Kadapa: అవినాష్ రెడ్డి, జగన్‌ను టార్గెట్ చేస్తోన్న షర్మిల
Kadapa: అది రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లా.. వైఎస్ కుటుంబానికి రాజకీయ అడ్డా. ఇప్పుడు ఏపీలో ఎన్నికలంతా ఒకవైపు అయితే.. ఆ జిల్లా ఒక్కటే ఒకవైపుగా మారింది. అక్కడ ఎన్ని పార్టీలు పోటీ చేస్తున్నా.. రెండు పార్టీల మధ్యే వార్ వాడీవేడిగా సాగుతోంది. అదే ఏపీ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా మారిన కడప జిల్లా.
ఇక్కడ ఎలక్షన్ ఫైట్‌లో సై అంటే సై అంటోంది ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. అందుకే కడప అందరి అటెన్షన్ గ్రాబ్ చేస్తోంది. ఈ ఎన్నికలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలవబోతుంది. ఒకే కుటుంబంలోని వ్యక్తులు మాత్రమే కాదు.. జిల్లా రాజకీయాల్లో ఇప్పుడంతా ఒకే టాపిక్ ఎజెండాగా మారిపోయింది. అదే వైఎస్ వివేకా హత్య. అధికార, విపక్షాల మధ్య ఈ అంశంపై పరస్పర ఆరోపణలు కొత్తేమీ కాదు.. కానీ అప్పటికీ ఇప్పటికీ సీన్ మారింది. అప్పుడు కేవలం పార్టీల మధ‌్య జరిగిన మాటలయుద్ధం.. ఇప్పుడు ఓ కుటుంబంలోని వ్యక్తుల మధ్య జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కడప రాజకీయం రంజుగా మారబోతుంది.
ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టి.. అనూహ్యంగా కడప బరిలోకి దిగారు వైఎస్ షర్మిల. ఇప్పుడు షర్మిల అభ్యర్థిత్వంతో కడప రాజకీయమంతా హీటెక్కిపోయింది. సిట్టింగ్ ఎంపీగా అవినాష్ ఉన్న స్థానంలో షర్మిల పోటీకి దిగడంతోనే కడప ఏపీ పాలిటిక్స్‌లో స్పెషల్ ఫోకస్‌గా మారింది. బస్సుయాత్రలతో కడప పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం చుట్టేస్తున్న షర్మిల.. తన ప్రచారంలో వివేకా హత్య కేసునే ప్రధాన ఎజెండాగా ఎంచుకున్నారు. ఇక షర్మిల ప్రచారానికి మద్దతుగా వైఎస్ వివేకా కూతురు సునీత కూడా పాల్గొనడం రాష్ట్ర రాజకీయాల్లో కడప చర్చనీయాంశంగా మారింది. వెళ్లిన ప్రతీచోటా వివేకా హత్య కేసు గురించే మాట్లాడుతూ అవినాష్‌తో పాటు, సీఎం జగన్‌ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఇద్దరు.
షర్మిల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో.. కడప జిల్లాలో కాంగ్రెస్‌కు ఓటు మళ్లకుండా ఫోకస్ పెంచింది వైసీపీ. వివేకా హత్య కేసు ఎజెండాగా ప్రచారం చేస్తోన్న షర్మిలకు దీటుగా.. ఈనెల 22 నుంచి సీఎం సతీమణిని రంగంలోకి దించుతున్నారు. జగన్ నామినేషన్ వేసిన క్షణం నుంచి ఎన్నికలయ్యే దాకా వైఎస్ భారతి పులివెందులలోనే మకాం వేయనున్నారు. పులివెందుల నుంచే భారతి కడప రాజకీయాలను పర్యవేక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతి రంగంలోకి దిగితే వైఎస్ కుటుంబంలోని మహిళల ఆధ్వర్యంలోనే కడప ఎన్నికలు సాగేలా కనిపిస్తున్నాయి.