సీఎం జగన్‌కామెంట్లపై రాజకీయవర్గాల్లో చర్చ.. జగన్ మాటల వెనక అంతార్థమేంటి?
తూర్పు గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా చేసిన కొన్ని కామెంట్లు, రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఎప్పుడూ అలా మాట్లాడని జగన్, ఇప్పుడే ఎందుకు మాట్లాడారన్న డిస్కషన్ మొదలైంది. ఇంతకీ జగన్ ఏమన్నారు ఆ మాటల అంతరార్థమేంటి?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం ప్రారంభోత్సవంలో, కొన్ని కీలక, నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇవే మాటలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఒకవైపు టీడీపీ, జనసేన విమర్శలు, ఆరోపణలు, ఆందోళనలు మరోవైపు కొందరు బీజేపీ నేతల వ్యాఖ్యల నేపథ్యంలో, సీఎం జగన్ చేసిన ఈ కామెంట్ల అంతరార్థమేంటన్న డిస్కషన్ సాగుతోంది. ఇంతకీ ముఖ్యమత్రి ఏమన్నారు...?
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఈ వ్యాఖ్యలు చేశారు జగన్. 'ప్రజల కోసం ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపడుతున్నాం. అయినా మన మీద అపనిందలు వేస్తున్నారు. ప్రజల్ని మభ్యపెడుతున్నారు. దుష్ర్పచారం చేస్తున్నారు. ఎంతమంది శత్రువులు ఏకమైనా ఎదుర్కొంటా. ఎన్ని అపనిందలు వేసినా తట్టుకుని నిలబడతా. దానికి దేవుడి దయ. మీ చల్లని దీవెనలు ఉంటే చాలన్నారు సీఎం జగన్. అయితే, ఎంతమంది శత్రువులు ఎదురైనా అని జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా నొక్కి చెప్పడం వెనుక ఉద్దేశం ఏమై వుంటుందన్న చర్చ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ఆరు నెలల పాలనపై తెలుగుదేశం ఓ రేంజ్‌లో విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. జనసేన సైతం లాంగ్‌మార్చ్‌లు, కరపత్రాలూ అంటూ చెలరేగిపోతోంది. టీడీపీ, జనసేనలు మాత్రమే మొన్నటి వరకు విరుచుకుపడితే, ఈమధ్య భారతీయ జనతా పార్టీ కూడా తీవ్ర విమర్శలు చేస్తోంది. జగన్ టార్గెట్‌గా పదునైన ఆరోపణలు చేస్తోంది. తిరుమల వివాదాన్ని రాజేస్తోంది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రోత్సహించడం వెనుక మత మార్పిడుల కుట్ర ఉందంటూ, తీవ్రమైన విమర్శలు చేస్తోంది బీజేపీ.
బీజేపీ నేతలు జగన్‌ను మతం కోణంలోనే టార్గెట్ చేస్తున్నారు. అటూ చంద్రబాబు, పవన్‌లు సైతం ఇదే యాంగిల్లో ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. అంటే, బీజేపీ, టీడీపీ, జనసేన అన్నీ కలసి తన ప్రభుత్వం మీద దాడి చేస్తున్నాయని, తన వ్యాఖ్యల్లో చెప్పకనే చెప్పారు జగన్.
ఇలా జగన్ టార్గెట్‌గా బీజేపీ, టీడీపీ, జనసేన ఏకమయ్యాయని, త్వరలో ఒకే వేదికగా ఏర్పడే అవకాశమూ వుందని, కొందరు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అందుకు జగన్ కూడా మానసికంగా సిద్దమవుతున్నారంటున్నారు. టీడీపీ, జనసేనలతో పాటు బీజేపీ మీద కూడా ధాటిగా విమర్శలు చేసేందుకు రెడీ అవుతున్నారని విశ్లేషిస్తున్నారు. మత్య్సకార సభలో జగన్ చేసిన కామెంట్ల సారమిదేనంటున్నారు. చూడాలి, ఏపీలో రోజురోజుకు హీటెక్కుతున్న పాలిటిక్స్‌లో, ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.