Andhra Pradesh: ఒక్కసారిగా వేడెక్కిన ఏపీ రాజకీయాలు
Andhra Pradesh: రెండు పార్టీల మధ్య అగ్గిరాజేసిన అయ్యన్నపాత్రుడు కామెంట్స్
Andhra Pradesh: ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ మంత్రి టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన కామెంట్స్ రెండు పార్టీల మధ్య అగ్గిరాజేశాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య మొదలైన మాటల యుద్ధం భౌతిక దాడుల వరకు వెళ్లింది. ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మధ్య తోపులాట జరిగింది. అయ్యన్న వ్యాఖ్యలకు నిరసనగా ఉండవల్లిలోని మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడించేందుకు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కార్యకర్తలతో సహా అక్కడికి వెళ్లారు.
ఐతే అప్పటికే అక్కడున్న టీటీడీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న టీటీడీ కార్యకర్తలు.. వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. జోగి రమేష్ – బుద్ధా వెంకన్న ఒకరినొకరు తోసుకున్నారు. జోగి-బుద్ధా వెంకన్న ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. పస్పరం తిట్టుకుంటూ తోసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణ నెలకొంది. అక్కడున్న పోలీసులు కూడా వీరిని అదుపు చేయలేకపోయారు.
తాము నిరసన చేపట్టేందుకు వస్తే గూండాలతో అడ్డుకుంటున్నారని జోగి రమేష్ ఆరోపించారు. చంద్రబాబు ఇంట్లో కూర్చోని తనపై దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. అనంతరం అక్కడే బైఠాయించి నిరసనకు దిగారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పార్టీ నేతలు పట్టాభి, నాగుల్ మీరా, ఇతర నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు. ఎమ్మెల్యే జోగి రమేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ కక్షతోనే ఇలా చేస్తన్నారని సీఎం జగనే ఆ పార్టీ ఎమ్మెల్యేని చంద్రబాబుపైకి ఉసిగొల్పారని ఆరోపించారు.
మొన్నదివంగత టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు వర్ధంతి సభలో పాల్గొన్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై మండిపడ్డారు. ముఖ్యమంత్రి చికెన్ అమ్ముతారా.. చేపలు అమ్ముతారా..? నాటు సారా అమ్ముతారా..? చేతగాని పాలకులంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. దీనిపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. సీఎం జగన్ ను దూషిస్తే చూస్తూ ఊరుకోమని.. చంద్రబాబుని, అయ్యన్నపాత్రుడ్ని రాష్ట్రంలో తిరగనివ్వమంటూ జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు. అలా మొదలైన సవాళ్లు దాడులకు వారకు వెళ్లాయి.
ఇక అయ్యన్న పాత్రుడు ఎస్పీ నా కొడుకులు అని సంభోదించడంతో ఏపీ ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆయన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని ఆరోపించింది. ప్రజా ప్రతినిధులు హుందాతనంతో, విలువలతో, స్థాయికి తగ్గట్టు వ్యవహరించాల్సిన అవసరం ఉందని చురకులు పెట్టింది.