Police Traced Gold Theft Case: బంగారం చోరి కేసును చేధించిన పోలీసులు.. భారీ స్థాయిలో బంగారం, వెండి, నగదు స్వాధీనం

Police Traced Gold Theft Case: తను అనుకున్నట్టు బంగారాన్ని దోచేశాడు. వాటిని నిరూపించే సీసీ పుటేజీని లేకుండా చేశాడు.

Update: 2020-07-25 02:30 GMT
Vijayawada Theft Case

Police Traced Gold Theft Case: తను అనుకున్నట్టు బంగారాన్ని దోచేశాడు. వాటిని నిరూపించే సీసీ పుటేజీని లేకుండా చేశాడు. అయితే అదే షాపులో వేరొకరి వేలిముద్రలు లేకుండా ఉన్న విషయాన్ని మాత్రం మరిచాడు. అందుకే పోలీసులకు దొరికిపోయాడు. విజయవాడలో జరిగిన ఘటనలో పోలీసులు భారీగా బంగారం, వెండి, నగదును చోరి చేసిన ఘటనను మూడు గంటల్లో చేధించి, నిందుతుణ్ని అరెస్టు చేశారు.

కిలోల కొద్దీ బంగారం, వెండి వస్తువులు.. రూ.లక్షల్లో నగదు జ్యూవెలరీ షాపులో ఉందని గుర్తించిన గుమస్తా వాటిని చోరీ చేయడానికి సినిమా తరహాలో సీన్‌ క్రియేట్‌ చేసి.. చివరకు పోలీసులకు చిక్కిన ఘటన విజయవాడ నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. మూడు గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు ఇంటి దొంగను అరెస్ట్‌ చేశారు. నిందితుడి నుంచి 7 కిలోల బంగారం, 19 కిలోల వెండి, రూ.42 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

చోరీ చేసి.. కట్టుకథ అల్లాడు

► వన్‌టౌన్‌లోని కాటూరి వారి వీధిలో రాజుసింగ్‌ చరణ్‌ అనే వ్యాపారి సాయిచరణ్‌ జ్యూవెలరీ పేరిట షాపు నిర్వహిస్తున్నాడు.

► సుమారు 2 నెలల క్రితం రాజస్తాన్‌కు చెందిన విక్రమ్‌ కుమార్‌ లోహార్‌ అలియాస్‌ విక్రమ్‌ (23) అనే యువకుణ్ణి గుమస్తాగా చేర్చుకున్నాడు.

► లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని నెలలుగా వ్యాపారం సరిగా జరగకపోవడంతో రాజుసింగ్‌ 19 కిలోల వెండి వస్తువులను, రూ.20 లక్షల నగదును షాపులోనే ఉంచాడు.

► దాంతోపాటు తన స్నేహితుడైన గురుచరణ్‌ జ్యూవెలరీ యజమాని మనోహర్‌ సింగ్‌కు చెందిన 7 కిలోల బంగారు ఆభరణాలు, రూ.22 లక్షల నగదు కూడా రాజుసింగ్‌ తన షాపులోనే భద్రపరిచాడు.

► బంగారం, వెండి ఆభరణాలు, నగదు భారీగా ఉండటంతో రాజుసింగ్‌ గురువారం రాత్రంతా షాపులోనే ఉండి వేకువజామున గుమస్తా విక్రమ్‌ను కాపలాగా ఉంచి ఇంటికి వెళ్లాడు.

► అప్పటికే వాటిని కాజేసేందుకు పథకం పన్నిన గుమస్తా విక్రమ్‌ బంగారు ఆభరణాలు, వెండి, నగదును ఓ బ్యాగ్‌లో సర్ది షాపు వెనుక దాచాడు. అనంతరం సీసీ కెమెరా, ఫుటేజీ రికార్డర్‌ డీవీఆర్‌ను తొలగించి కాలువలో పడేశాడు.

► కత్తితో తన వంటిపై గాయాలు చేసుకుని.. తాడుతో కాళ్లు, చేతులు కట్టేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టుగా షాపులోనే మూలుగుతూ పడి ఉన్నాడు.

ఏం జరిగింది: బంగారు ఆభరణాల దుకాణంలో పనిచేసే గుమస్తా అదే దుకాణంలో 7 కిలోల బంగారు ఆభరణాలు, 19 కిలోల వెండి, రూ.42 లక్షల నగదు చోరీ చేశాడు.

ఎక్కడ.. ఎప్పుడు : విజయవాడ వన్‌టౌన్‌ కాటూరి వారి వీధిలోని సాయిచరణ్‌ జ్యూవెలరీ షాపులో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

కట్టుకథ ఎలా అల్లాడంటే.. : షాపులోని బంగారం, వెండి, నగదును బ్యాగ్‌లో సర్దేసి షాపు వెనుక దాచాడు. ఆ తరువాత వచ్చి సీసీ కెమెరాను, రికార్డర్‌ను తొలగించి కాలువలో పడేశాడు. వంటిపై కత్తితో గాయం చేసుకుని.. కాళ్లు, చేతులను తనకు తానే తాడుతో కట్టేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు నటించాడు.

ఎలా పట్టుబడ్డాడంటే..: షాపులోకి వేరే వ్యక్తులు వచ్చినట్టు ఆనవాళ్లు లేకపోవడం.. వేలిముద్రలు అతడివి మాత్రమే ఉండటం.. ఇతర క్లూస్‌ ఆధారంగా షాపు గుమస్తాయే దొంగ అని పసిగట్టిన పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు.

ఇలా దొరికేశాడు

► రాజుసింగ్‌ చరణ్‌ షాపులో దాచిన బంగారు ఆభరణాల్ని తీసుకు రావాలని అతని స్నేహితుడు మనోహర్‌సింగ్‌ తన గుమస్తా గోపాల్‌సింగ్‌ను ఉదయం 9.30 గంటల సమయంలో ఆ షాపునకు పంపించాడు.

► గోపాల్‌సింగ్‌ అక్కడకు వెళ్లేసరికి విక్రమ్‌ రక్తపు గాయాలతో కాళ్లు, చేతులు కట్టిపడేసి ఉండటాన్ని చూసి యజమానికి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు.

► దీంతో మనోహర్‌సింగ్, అతని స్నేహితుడు రాజుసింగ్‌ హుటాహుటిన అక్కడకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

► రంగంలోకి దిగిన పోలీసులు విక్రమ్‌ను ఆస్పత్రికి తరలించి కంప్యూటర్‌లో నిక్షిప్తమైన సీసీ ఫుటేజీని పరిశీలించి షాపులోకి ఇతర వ్యక్తులెవరూ రాలేదని గుర్తించారు.

► చోరీ స్థలంలో లభ్యమైన వేలిముద్రలు గుమస్తా విక్రమ్‌ వేలిముద్రలతో సరిపోలడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నిజం బయటపడింది.

► కేసును పక్కదోవ పట్టించేందుకే తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్టు కట్టుకథ సృష్టించినట్టు విక్రమ్‌ అంగీకరించాడు.

► చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని, విక్రమ్‌కు ఎవరైనా సహకరించారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని నగర సీపీ బత్తిన శ్రీనివాసులు చెప్పారు. 

Tags:    

Similar News