పవన్‌, బాలకృష్ణ రాకతో పోలీసుల అలర్ట్‌.. రాజమండ్రిలో అమల్లో ఉన్న 144 సెక్షన్‌

Rajahmundry: 40 నిమిషాల పాటు చంద్రబాబుతో మాట్లాడనున్న పవన్‌, బాలకృష్ణ

Update: 2023-09-14 05:04 GMT

పవన్‌, బాలకృష్ణ రాకతో పోలీసుల అలర్ట్‌.. రాజమండ్రిలో అమల్లో ఉన్న 144 సెక్షన్‌

Rajahmundry: చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత జైలు పాలు కావడంతో.. ఆ పార్టీ నేతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోపక్క అధికార పార్టీ మాత్రం.. ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. మరోసారి గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. చంద్రబాబు అరెస్ట్‌ను చూపించి.. ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకుంటోంది. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో అరెస్టయిన మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించడంతో ఆయనను జైలుకు తరలించారు.

ఇదిలా ఉంటే.. ఇవాళ రాజమండ్రికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వెళ్లనున్నారు. స్కిల్‌ స్కామ్‌లో అరెస్టయి.. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న చంద్రబాబును ఆయన పరామర్శించనున్నారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు హైదరాబాద్‌ బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రికి చేరుకుంటారు పవన్‌ కల్యాణ్‌. ఎయిర్‌పోర్ట్‌ నుంచి రోడ్డుమార్గంలో లోకేష్‌ క్యాంప్‌కు వెళ్లనున్నారు. అక్కడ చంద్రబాబు భార్య భువనేశ్వరి, లోకేష్‌, బ్రాహ్మణిలను పవన్‌ పరామర్శిస్తారు. అనంతరం..

అక్కడి నుంచి నేరుగా రాజమండ్రి సెంట్రల్‌ జైలు వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు బాలకృష్ణతో కలిసి చంద్రబాబును కలవనున్నారు పవన్. దాదాపు 40 నిమిషాల పాటు చంద్రబాబుతో మాట్లాడనున్నారు. అనంతరం.. పవన్‌, బాలకృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. ములాఖత్‌ తర్వాత పవన్‌ ఏం మాట్లాడుతారనే దానిపై అటు టీడీపీ, ఇటు జనసేన కేడర్‌ తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.

అయితే, చంద్రబాబు అరెస్టైన సమయంలోనే ఆయనను కలిసేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నించారు. కానీ ఏపీ పోలీసులు అందుకు అనుమతించలేదు. ఓసారి బేగంపేట విమానాశ్రయంలో ప్రత్యేక విమానానికి అనుమతి నిరాకరించారు. మరోసారి రోడ్డు మార్గంలో వెళ్తున్నప్పుడు పవన్‌ను అడ్డుకున్నారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్టును పవన్ తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు అరెస్టు తర్వాత మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్‌లో మాట్లాడిన పవన్.. వైసీపీపై తాను పోరాటం చేస్తానని ధైర్యం కల్పించారు. చంద్రబాబు అరెస్ట్ నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయగా.. జనసేన మద్దతిచ్చింది. లోకేష్‌కు ఫోన్ చేసి ముందుగానే సంఘీభావం తెలిపారు పవన్‌. అదే సమయంలో.. లోకేష్ కూడా పవన్ కల్యాణ్ అన్నలాగా అండగా ఉన్నారని.. తాను ఒంటరి వాడిని కాదని చెప్పారు. అయితే.. ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో చంద్రబాబుతో పవన్‌ ములాఖత్‌కు అనుమతి లభించింది.

మరోవైపు.. రాజమండ్రికి పవన్‌ రాకతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. పవన్‌తో పాటు బాలకృష్ణ కూడా రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌ వద్దకు వస్తుండటంతో.. అటు టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా భారీగా హాజరయ్యే ఛాన్స్‌ ఉంది. దీంతో.. పోలీసులు అలర్టయ్యారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే రాజమండ్రిలో 144 సెక్షన్‌ అమల్లో ఉంది. 

Tags:    

Similar News