Revupolavaram Beach: అందాల వేదికగా రేవుపోలవరం తీరం

* విశాఖకు 80కి.మీ దూరంలో కనువిందు * టూరిస్ట్‌ స్పాట్‌గా, షూటింగ్‌ స్పాట్‌గా గుర్తింపు * సముద్రంలో 200మీటర్ల పొడవైన వంతెన

Update: 2021-08-18 02:47 GMT

రేవుపోలవరం తీరం (ట్విట్టర్ ఫోటో)

Revupolavaram Beach: అదో అందాల వేదిక. అక్కడికి వెళ్తే.. ఆనందాల వేడుక.. ఎత్తైన కొండలు, మెరిసే ఇసుక తిన్నెలు, ఎగిసే అలలు రా రమ్మని పిలుస్తాయి. సంద్రం వంక చూస్తూ నిలబడితే, కెరటాలు పాదాలను ముద్దాడివెళ్తాయి.

వైజాగ్ అనగానే ఆర్కేబీచ్‌, రుషికొండ, యారాడ బీచ్‌లు గుర్తుకు వస్తాయి. అదే విశాఖకు 80కిలోమీటర్లు దూరంలో ఉన్న రేవుపోలవరం తీరం కూడా అందాల వేదికగా నిలుస్తోంది. కనులముందు కడలిని చూడగానే, మనసు ఉప్పొంగుతుంది. ఒడ్డుకు వచ్చిన అలలు వెళ్తూ వెళ్తూ, కాళ్ల కింద ఇసుకనే కాదూ మదినీ దోచుకెళ్తాయి. ఇన్ని అందాలను ఆస్వాదిస్తుండగానే, తీరం నుంచి సముద్రంలోకి నిర్మించిన వంతెన అటుగా రమ్మని పిలుస్తుంది.

సముద్ర మట్టానికి 26 మీటర్ల ఎత్తులో ఉన్న రేవుపోలవరం బీచ్‌.. టూరిస్ట్‌ స్పాట్‌గా, జిల్లా వాసులకు మంచి పిక్‌నిక్‌ స్పాట్‌ గా నిలుస్తోంది. ఇక్కడ సుమారు 200 మీటర్ల పొడవైన వంతెన ఉంటుంది. దానిపైకి వెళ్తే సంద్రం మధ్యలో నిల్చున్న అనుభూతి కలుగుతుంది. ఈ అనుభవాలన్నిటినీ అనుభవించాలంటే రేవుపోలవరం వెళ్లాల్సిందే.

ఈ బీచ్‌లో ఏర్పాటు చేసిన శివపార్వతుల విగ్రహాలు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మరోవైపు ఎంతో చరిత్ర కలిగిన లక్ష్మీమాధవస్వామి ఆలయం, తీరంలో నిర్మించిన జెట్టీ టూరిస్టులను అట్రాక్ట్‌ చేసుకుంటున్నాయి. ఈ సుందరమైన తీరంలో ఎన్నో సినిమాలు షూటింగ్‌ జరిగాయి. గత ప్రభుత్వంలో రేవుపోలవరం తీరం అభివృద్ధికి 4కోట్లు కేటాయించినప్పటికీ, సరైన అభివృద్ధి జరగలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కాటేజ్ లు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయని విమర్శిస్తున్నారు.

Tags:    

Similar News