ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో ఆసుపత్రిలో చేరుతున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అస్వస్థతపై సర్కార్ ఉదాసీనతగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఏలూరులో జనసేన డాక్టర్ల బృందం పర్యటనలో అనేక లొసుగులు కనిపించాయన్నారు. చిన్న వసతులను సైతం ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో చెప్పాలన్నారు.
చిన్నపిల్లలకు కనీసం I.C.U వార్డు కూడా లేదని ధ్వజమెత్తారు. ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయకుండా సాధారణ రోగుల వార్డుల్లోనే చికిత్సలు ఎందుకు చేస్తున్నారన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న 500 పడకల ఆస్పత్రిలో న్యూరోఫిజీషియన్ లేకపోవడం బాధాకరం అన్నారు. ఏలూరులో సాధారణ పరిస్థితులు నెలకొనే విధంగా తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.