Pawan kalyan on Law Nestham: 'లా నేస్తం' పథకాన్ని కొనసాగించాలంటున్న 'వకీల్ సాబ్'
Pawan kalyan on Law Nestham: కరోనా నేపథ్యంలో అన్ని వర్గాల మాదిరిగా ఇబ్బందులు పడుతున్న న్యాయవాదులకు ప్రకటించిన లా నేస్తం పథకాన్ని కొనసాగిస్తూ వారిని ఆదుకోవాలని జనసేన..
Pawan kalyan on Law Nestham: కరోనా నేపథ్యంలో అన్ని వర్గాల మాదిరిగా ఇబ్బందులు పడుతున్న న్యాయవాదులకు ప్రకటించిన లా నేస్తం పథకాన్ని కొనసాగిస్తూ వారిని ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. దీనికి సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి వల్ల అన్ని వర్గాలు ఇబ్బందులు పాలవుతున్నాయి. ఇలాంటి తరుణంలో పాలకులు సహృదయంతో స్పందించాలి. ఉన్న పథకాలను కొనసాగిస్తూ సక్రమంగా నిధులు విడుదల చేయాలి. కరోనా కష్టాలు మొదలైనప్పటి నుంచి 'లా నేస్తం' పథకం ఎందుకు నిలిచిపోయిందో, న్యాయవాదుల సంక్షేమ నిధి ఏమైందో న్యాయవాదులకు అర్థం కాని పరిస్థితి నెలకొందని జనసేన అధినేత వపన్ కల్యాణ్ అన్నారు.
న్యాయవాదులు న్యాయ శాస్త్రం అభ్యసించి ఉన్నతమైన వృత్తిలో ఉన్నా ఆర్థికంగా కుదురుకొనే పరిస్థితి ఎక్కువమందికి లేదు అనేది వాస్తవం. ఎక్కువ మందికి చాలీచాలని సంపాదనే వస్తోంది. కరోనా ప్రభావంతో మేజిస్ట్రేట్ కోర్టు నుంచి ఉన్నత న్యాయస్థానం వరకూ విరామం ప్రకటించాయి. జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5 వేలు ఇచ్చే 'లా నేస్తం' పథకం కొనసాగి ఉంటే వారికి ఈ కష్టకాలంలో భరోసా లభించేదన్నారు. లా నేస్తం నిధులు నిలిపివేయడం సమంజసం కాదు. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు ఇస్తామన్నారు... జీవో ఇచ్చారు... అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకూ నిధులు విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనా విపత్కర స్థితిలో క్లయింట్ల నుంచి ఫీజులు వచ్చే మార్గం కూడా లేకపోవడంతో న్యాయవాదులు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం ఈ రంగంలో ఉన్నవారు నా దృష్టికి తీసుకువచ్చారన్నారు. కరోనాతో ఆ సంపాదన కూడా లేకపోవడంతో ఎందరో న్యాయవాదులు కష్టాలుపడుతున్నారని ఆవేదన చెందారు. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం సానుభూతితో స్పందించాలి. జూనియర్, సీనియర్ అనే భేదభావం లేకుండా అందరికీ ఆరు నెలలపాటు నెలకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక భృతి ఇవ్వాలని న్యాయవాదులు కోరుతున్నారు. న్యాయవాదులకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొంటే వారి పరిస్థితి కుదుటపడుతుంది. లా నేస్తం పథకాన్ని కొనసాగించడంతోపాటు, న్యాయవాదుల సంక్షేమ నిధికి సంబంధించిన నిధులను తక్షణం విడుదల చేయాలని పవన్ డిమాండ్ చేశారు.