కడప దుర్ఘటన..గనుల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలి: జనసేనాని
Pawan Kalyan: ముగ్గురాయి గనుల్లో భారీ పేలుడు సంభవించి 10 మంది మృత్యువాత పడిన ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించారు.
Pawan Kalyan: కరోనా నుంచి కోలుకున్న వెంటనే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రజా సమస్యలపై స్పందించారు. కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె శివారు ప్రాంతంలో ఉన్న ముగ్గురాయి గనుల్లో భారీ పేలుడు సంభవించి 10 మంది మృత్యువాత పడిన ఘటనపై స్పందించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మామిళ్లపల్లె దుర్ఘటన చోటుచేసుకున్న ముగ్గురాయి గనుల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
ముగ్గురాయి గనుల్లో జిలెటిన్స్ స్టిక్స్ పేలి పది మంది చనిపోయారన్న వార్త హృదయాన్ని కలచివేసిందని పేర్కొన్నారు. ఇది విషాదకరమైన ఘటన అని, ఈ ఘటనలో చనిపోయిన వారిని గుర్తించలేని పరిస్థితి ఉందంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుస్తోందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు
2018లో కర్నూలు జిల్లా హత్తిబెళగల్ లో ఓ గనిలో పేలుడు జరిగి ఇదే రీతిలో 12 మంది చనిపోయారని, ఇలాంటి ఘటనలు జరుగుతున్నా గనుల యజమానులు కార్మికుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని పవన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కరోనా వైరస్ నెగిటివ్ గా నిర్థారణ అయింది. పవన్ కళ్యాణ్ గత నెల కరోనా బారినపడి, హైదరాబాద్ లోని తన ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటోన్న విషయం తెలిసిందే. ఆయనకు మూడు రోజుల క్రితం వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారని, అందులో నెగెటివ్‌గా నిర్ధారణ అయిందని పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పేరిట ఓ ప్రకటన వచ్చింది.
ఆరోగ్య పరంగా పవన్ కల్యాణ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేవని వైద్యులు తెలిపారని అందులో పేర్కొన్నారు. తన ఆరోగ్యం బాగుపడాలని పూజలు, ప్రార్థనలు చేసిన జనసైనికులు, అభిమానులకు పవన్ కృతజ్ఞతలు తెలిపారని వివరించారు