Pawan Kalyan, Anitha Meeting: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత భేటీ.. విషయం ఏంటంటే..

Update: 2024-11-07 16:46 GMT

Pawan Kalyan and AP Home minister Vangalapudi Anitha meeting: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఏపీ సీఎం ఆఫీస్ వీళ్ల భేటీకి వేదికైంది. నేరాలను అరికట్టే విషయంలో పోలీసులు మెతక వైఖరి అవలంభిస్తున్నారని చెప్పే క్రమంలో తానే హోంశాఖ మంత్రినైతే పరిస్థితి మరోలా ఉంటుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలే గత కొద్ది రోజులుగా ఏపీలో హాట్ టాపిక్ అయ్యాయి. హోంశాఖ మంత్రి అనితను తక్కువ చేసేలా ఆయన మాట్లాడారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఏపీలో నేరాలు పెరిగిపోతున్నాయని డిప్యూటీ సీఎం మాటలే చెబుతున్నాయని అంటున్నారు. ఈ తరుణంలో డిప్యూటీ సీఎం, హోం మినిష్టర్ భేటీ అవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే, పవన్ కళ్యాణ్, అనితల భేటీలోనూ నేరాలను అరికట్టే విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గురించే ప్రధానంగా చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ భేటీ వివరాలను ఎక్స్ ద్వారా హోం మంత్రి అనిత మీడియాతో పంచుకున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు , హోంశాఖ తీసుకుంటున్న చర్యలను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె తెలిపారు.

చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా గట్టి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సూచించారని వెల్లడించారు. తమ ప్రభుత్వం జన సంక్షేమం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం ప్రతిక్షణం పరితపించే ప్రజా ప్రభుత్వం తమ కూటమి ప్రభుత్వం అని హోం మంత్రి అనిత అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News