చిత్తూరు జిల్లాలోని ఆ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు 45 ఏళ్లుగా ఏకగ్రీవం

*పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి యునామస్‌గా సర్పంచ్‌ ఎన్నికఈ *సారి పోటాపోటీగా నామినేషన్లు *ఏకగ్రీవ సాంప్రదాయానికి చెక్‌ పడే అవకాశం

Update: 2021-02-03 08:57 GMT

 Vedurukuppam 

పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ప్రభుత్వం ఏకగ్రీవాలకు బంపర్‌ ఆఫర్లు ప్రకటించినా.. నామినేషన్లకు అభ్యర్థులు క్యూ కడుతున్నారు. ఎన్నికల్లో పోటీ పడేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఆఖరికి 45ఏళ్లుగా ఏకగ్రీవమయ్యే గ్రామంలో సైతం అభ్యర్థులు ఎన్నికలకు సై అంటున్నారు. ప్రశాంతంగా యునామస్‌ జరిగే గ్రామంలో సైతం నామినేషన్లు ఉత్కంఠను రేపుతున్నాయి. పంచాయతీ పుట్టినప్పటి నుంచీ ఏకగ్రీవాన్నే నమ్ముకున్న ఆ గ్రామం ఇప్పుడు ఎన్నికల సమర శంఖం పూరిస్తోంది.

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలకేంద్రానికి చెందిన ప్రజలు 45ఏళ్లుగా పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేదు. ఎందుకంటే అక్కడ ప్రతీసారి ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. పంచాయతీ ఎన్నికలో పార్టీల ప్రభావం ఉండదు. గ్రామస్తులంతా చర్చించుకొని యునామస్‌గా సర్పంచ్‌ను ఎన్నుకుంటారు. కానీ ఈసారి ఆ గ్రామంలో పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు.

వెదురుకుప్పం పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. కానీ ఈ సారి ఆ సాంప్రదాయానికి చెక్ పడేలా ఉంది. అయితే నామినేషన్ల ఉపసంహారణ వరకు ఏదైనా జరగచ్చని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు

వెదురుకుప్పం పంచాయతీలో మొత్తం 1806 మంది ఓటర్లు ఉన్నారు. 10 వార్డులున్నాయి. ఎన్నికలు రాగానే.. ముందుగానే గ్రామస్తులు చర్చించుకొని ఒకరికి పట్టం కట్టేవాళ్లు. ఈ క్రమంలో తొలిసారి పెద్ద చెంగారెడ్డి సర్పంచ్‌ పదవీని దక్కించుకున్నారు. ఆ తర్వాత శివశంకర్ రెడ్డి పదేళ్లపాటు ఏకగ్రీవ సర్పంచ్‌గా కొనసాగారు. తర్వాత గోవిందరెడ్డి, ఎం.చిన్నబ్బ, నీరజ, చిరంజీవి రెడ్డి, నవనీతమ్మ ఏకగ్రీవ సర్పంచ్‌లుగా బాధ్యతలు తీసుకున్నారు.

అయితే ఈ సారి పోటీలో నలుగురు ఉన్నారు. ఎస్సీ ఉమెన్‌కు కేటాయించబడిన స్థానంలో‌‌ నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. దీంతో గ్రామస్తులు ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కొత్త సాంప్రదాయాన్ని ఆహ్వానించలేకపోతున్నారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు ఇంకా గడువు ఉండడంతో కాస్త ఆశాజనకంగా కనిపిస్తున్నారు.

సుమారు అర్థశతాబ్ధంగా వస్తున్న ఆచారాం వెదురుకుప్పంలో కొనసాగుతుందా. లేదంటే ఆ సాంప్రదాయానికి చెక్‌ పడినట్లేనా.. 45ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో ఎన్నికలు జరగడం ఖాయమేనా.. నామినేషన్ల ఉపసంహణ వరకు వేచి చూడాల్సిందే..

Tags:    

Similar News