Outsourcing system in AP Government: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 'ఆప్కాస్' ఏర్పాటు
Outsourcing system in AP Government: ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకాలు, జీతాలు చెల్లింపుల్లో ఎటువంటి అవినీతి చోటు చేసుకోకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం సంకల్పించింది.
Outsourcing system in AP Government: ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకాలు, జీతాలు చెల్లింపుల్లో ఎటువంటి అవినీతి చోటు చేసుకోకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. వీటిని సక్రమంగా నిర్వహించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇక నుంచి ఈ వ్యవస్థ ద్వారా నియామకాలు జరుగుతాయని, ఎటువంటి వివక్ష ఉండదని సీఎం జగన్మోహనరెడ్డి చెప్పుకొచ్చారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా ఠంచనుగా ఏ కోత లేకుండా గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. వ్యవస్థలో మార్పు తీసుకురావడంతో పాటు, లంచాల ప్రసక్తి లేకుండా పారదర్శకంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తామని స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కొండంత అండగా నిలుస్తూ ఏర్పాటు చేసిన 'ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్‌డ్ సర్వీసెస్' (ఆప్కాస్) కార్యకలాపాలను శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఒకేసారి 50 వేల మందికి పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నియామక పత్రాలు అందించేందుకు కంప్యూటర్‌లో బటన్ నొక్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనంతరం వివిధ జిల్లాల్లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
► నా సుదీర్ఘ పాదయాత్రలో అన్ని ప్రాంతాలు తిరిగాను. 14 నెలల పాటు 3,648 కిలోమీటర్లు నడిచాను. అప్పుడు ప్రతి చోట ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధలు విన్నాను.. చూశాను. 'ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరుగుతోంది' అని ఒక్కచోట కూడా ఎవరూ చెప్పలేదు.
► మాకు కాంట్రాక్ట్‌లో ఒక జీతం చూపి, అంతకంటే తక్కువ జీతం ఇస్తున్నారని, కాంట్రాక్టర్ మా జీతం కట్ చేస్తున్నారని కొంత మంది చెప్పారు. 'అన్నా.. ఈ ఉద్యోగం రావడానికి లంచాలివ్వాలి. మళ్లీ జీతాలు తీసుకోవడానికి కూడా లంచాలివ్వాలి.. ఇవి రెండూ ఇవ్వకపోతే మమ్నల్ని ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు' అని మరికొంత మంది ప్రతి జిల్లాలో చెప్పారు.
► ఔట్ సోర్సింగ్‌లో కొందరికి మేలు చేయడం కోసం కాంట్రాక్టర్లను తీసుకువచ్చారు. నాడు కొన్ని చోట్ల నాయకులు ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లుగా మారారు. ఆలయాల్లో పారిశుధ్య కాంట్రాక్ట్ పనుల మొత్తాన్ని అమాంతంగా పెంచి చంద్రబాబు బంధువు భాస్కరనాయుడుకు ఇచ్చారు.
► అందుకే ఈ వ్యవస్థను పూర్తిగా మార్చి, పారదర్శకత తేవాలనుకున్నా. అందులో పని చేస్తున్న ఉద్యోగులకు మెరుగైన జీతాలు ఇవ్వాలని, ఎవరికీ లంచాలు ఇవ్వకుండా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉండాలని భావించి 'ఆప్కాస్' ఏర్పాటు చేశాం.
► ఈ కార్పొరేషన్‌లో రెండు కేంద్రాలు ఉంటాయి. జిల్లా స్థాయిలో కలెక్టర్లు చైర్మన్లుగా జేసీలతో కూడిన కమిటీలు పని చేస్తాయి. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు రిజర్వేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా చూస్తారు. దీంతో ఎక్కడా అవినీతికి తావుండదు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది బాగా పని చేస్తే ఉద్యోగ భద్రత ఉంటుంది. ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా పని చేయాలి.
► గతంలో కాంట్రాక్ట్ సంస్థలు ఉద్యోగుల సంఖ్యను ఎక్కువ చూపి, తక్కువ సంఖ్యలో నియమించి వారితో పని చేయించుకునేవి. 20 మంది పని చేయాల్సి ఉండగా 15 మందినే నియమించి మిగతా ఐదుగురి వేతనాలను ఆ కాంట్రాక్టర్లు, ఇతర నేతలు పంచుకునేవారు. ఇప్పుడు ఈ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా వాటన్నింటికీ తావుండదు.
► కార్పొరేషన్‌ను సక్సెస్ చేయడం కోసం కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలి. ఈ కార్యక్రమం ద్వారా అంతా మంచి జరగాలని దేవుడిని కోరుకుంటున్నా.
► సాధారణ పరిపాలన శాఖకు చెందిన ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ నియామక పత్రాలను అందించారు. జిల్లాల్లో కలెక్టర్లు, మంత్రులు నియామక పత్రాలు అందించాలని సీఎం సూచించారు.
► ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్నితో పాటు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.