disadvantages of computer illiteracy: అవుట్ సోర్సింగ్ సిబ్బంది తొలగింపు
కంప్యూటర్ నాలెడ్జి లేకపోవడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోతోంది. కరోనా కష్టకాలంలో ఉద్యోగులను తొలగించడానికి యాజమాన్యాలు కారణాలు వెతుక్కుంటున్నాయి. ఇందులో కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడం ప్రముఖంగా మారిపోతోంది. సరిగ్గా దీనినే సాకుగా చూపిస్తూ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న పలువురి ఉద్యోగాలు ఎగిరిపోయాయి. దుర్గ గుడిలో కొంతకాలంగా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కంఫ్యూటర్ తో పనిచేయడం రాకపోవడం వల్ల తొలగిస్తూ చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే లాక్ డౌన్ కష్టాలతో ఇబ్బందులు పడుతున్న ఆ సిబ్బందికి ఇప్పుడు పని కోల్పోవడం కూడా మరింత కష్టాలలోకి నెట్టేసింది.
కరోనా కాలంలో సుమారు 25 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని దుర్గ గుడి దేవస్థానం ట్రస్ట్ తొలగించింది. టికెట్ కౌంటర్లు, లడ్డూ కౌంటర్లలోని తాత్కాలిక సిబ్బంది స్థానంలో శాశ్వత ఉద్యోగులకు విధులను కేటాయించగా.. వారికి కంప్యూటర్ ఆపరేటింగ్ రాకపోవడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, తాత్కాలిక సిబ్బంది తొలగింపుపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు లాక్ డౌన్ 5లో ఇచ్చిన సడలింపులకు అనుగుణంగా ఏపీలో కంటైన్మెంట్ జోన్లు మినహాయించి అన్ని ప్రాంతాల్లోనూ ఆలయాలు, ప్రార్ధనా మందిరాలు తిరిగి తెరుచుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు తిరుమల శ్రీవారి దర్శనానికి సాధారణ భక్తులకు రేపటి నుంచి అనుమతులు ఇచ్చింది టీటీడీ. ప్రతిరోజు ఏడువేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి టీటీడీ ఏర్పాట్లు చేయగా.. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఏడున్నర గంటల వరకు దర్శనానికి అనుమతులు ఉన్నాయి.