Operation Muskan: విజయవంతంగా ఆపరేషన్ ముస్కాన్ కోవిద్ 19.. 4,806 మందికి విముక్తి
Operation Muskan: ఏపీలో వీధి బాలలను విముక్తి చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆపరేషన్ ముస్కాన్ కోవిద్ 19 కార్యక్రమం విజయవంతమైంది.
Operation Muskan: ఏపీలో వీధి బాలలను విముక్తి చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆపరేషన్ ముస్కాన్ కోవిద్ 19 కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా 4,806 మంది వీధి బాలలకు విముక్తి కలిగించి, 4,703 మందిని తమ తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. కార్యక్రమం విజయవంతం కావడంతో ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి పోలీసులను అభినందించారు.
కరోనా కట్టడిలో భాగంగా ఏపీ ప్రభుత్వం వీధి బాలల కోసం 'ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్ 19' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ శాఖల సమన్వయంతో పోలీస్ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీని ద్వారా తప్పిపోయిన బాలబాలికలు, బాల కార్మికులు, అనాథ పిల్లలను గుర్తించి.. వారిని తల్లిదండ్రుల వద్దకు, అనాథలను పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. రాష్ట్రంలోని జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండులలో ఈ 'ఆపరేషన్ ముస్కాన్' కొనసాగుతోంది.
'ఆపరేషన్ ముస్కాన్'లో ఇప్పటివరకు సుమారు 4,806 మంది వీధి బాలబాలికలకు విముక్తి కల్పించారు. ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. 'ఆపరేషన్ ముస్కాన్' బృందం పనితీరును సీఎం వైఎస్ జగన్ అభినందించారని తెలిపారు. ముస్కాన్ కార్యక్రమం ఎంతగానో సక్సెస్ అయిందన్న ఆయన.. వేలాది మంది పిల్లలను రక్షించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.
ఈ ముస్కాన్ కార్యక్రమం ద్వారానే నాలుగేళ్ల తర్వాత తల్లి దగ్గరికి కొడుకును చేర్చామని.. అంతేకాకుండా కరోనా టెస్టులు చేసి.. చాలామంది పిల్లలకు వైరస్ సోకకుండా కాపాడగలిగామని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. కాగా, ఇప్పటివరకు మొత్తంగా 4806 వీధి బాలబాలికలను గుర్తించిన పోలీసులు 4703 మందిని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. అటు బాల కార్మికులుగా ఉన్న 278 మంది పిల్లలను రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించారు. వీరిలో 73 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించారు. అటు దేశంలోనే వీధి బాలబాలికలకు కరోనా పరీక్షలు చేస్తున్న మొదటి రాష్ట్రం ఏపీనే కావడం విశేషం.