ఆన్లైన్ లోన్స్.. ప్రాణాలు తీసేస్తున్నాయి!

ఆధార్ కార్డు ఉంటె చాలు నిమిషాల్లో లోన్ అంటారు..కానీ, లోన్ తీసుకున్నాకా చుక్కలు చూపిస్తారు. ఆన్లైన్ యాప్ తో లోన్స్ ఇచ్చి ప్రాణాలు తోడేస్తున్నారు.

Update: 2020-12-22 12:24 GMT

పరిచయం ఉండదు. తాకట్టు అవసరముండదు. డాక్యుమెంట్లతో పనిలేదు. కళ్లు మూసి తెరిచేలోగా అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. ఇక తిరిగి డబ్బులు చెల్లించే సమయంలో విశ్వరూపం చూపిస్తారు. వడ్డీల మీద వడ్డీలు. వాయింపుల మీద వాయింపులతో వేధిస్తారు. కౌంటింగ్‌ చేస్తే బారు వడ్డీ కూడా చిన్నదైపోతుంది. ఇక చెల్లించమని చేతులెత్తేస్తే.. తెలినవాళ్లకు ఫోన్‌ చేసి, పరువు తీసేస్తారు. బంధువుల ముందు తలవొంపులు తెస్తారు. ఇటు వడ్డీలు కట్టలేక.. అటు మాటలు పడలేక ఆత్మహత్యే శరణం అనే స్థితికి తీసుకువస్తున్నారు. సామాన్యులను జలగల్ల పట్టిపీడిస్తున్న లోన్‌ యాప్‌ దందాపై హెచ్ఎంటీవీ స్పెషల్‌ డ్రైవ్..

సామాన్యులే వారి టార్గెట్‌.. ముక్కు ముఖం తెలియకున్నా లోను ఇస్తామంటూ ఆశపెడతారు. సింపిల్‌గా ఓ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే సరిపోతుందని చెబుతారు. యాప్‌ ఓపెన్‌ చేయగానే.. క్షణాల్లో కోరిన అమౌంట్‌ అకౌంట్లో వేసేస్తారు. కానీ దానికి ముందు వచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఓకే చెప్పేస్తారు.. ఇక్కడే మనం వలలో చిక్కుకుంటాం.

లోన్ అమౌంట్‌ తిరిగే చెల్లించే సమయంలో అసలు ముసుగు బయటపడుతుంది. వడ్డీల మీద వడ్డీలేస్తారు. దీనికి తోడు ఛార్జీల మోత మోగిస్తారు. పర్సంటజీలంటూ వాయిస్తారు. 10వేలు తీసుకుంటే.. వారానికే 19వేలు బిల్లేస్తారు. కట్టామని చేతులెత్తేస్తే.. మన కంటాక్ట్ నెంబర్స్ కి మనం ఫ్రాడ్‌ అంటూ మెసేజ్‌ వెళ్లిపోతుంది.

ఇచ్చిన డబ్బులకు డబుల్‌ వసూలు చేస్తారు. ఐనా వదిలిపెట్టరు. చార్జీలు కట్టాలని వేధిస్తారు. చెల్లించమని మొండికేస్తే.. భూతుపురాణం మొదలుపెడతారు. ఆ మాటలు భరించలేక.. ఆ బెదిరింపులు తట్టుకోలేకనే చాలా మంది బాధితులు ప్రాణాలు విడిచారు.

ఏది ఏమైనా డబ్బులు ఈజీగా రావనే సూత్రాన్ని అందరు గుర్తుంచుకోవాలి.. ఆన్‌లైన్‌లో వచ్చే ఆఫర్లకు ఆశపడితే.. సర్వం కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా.. ఆన్‌లైన్‌ ఆఫర్లకు కాస్త దూరంగా మంచిది. ఇటు ప్రభుత్వాలు కూడా ఆన్‌లైన్ మోసాలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరముంది. 

Tags:    

Similar News