Vizag Steel Plant: రోజుకో మలుపు తిరుగుతున్న స్టీల్ ప్లాంట్ వ్యవహారం
Vizag Steel Plant: కేంద్రం వైఖరిపై మండిపడుతున్న ఏపీ ఎంపీలు * లోక్ సభలో స్టీల్ ప్లాంట్ మిగులు భూముల వ్యవహారంపై సమాధానం
Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం మనసు మారేలా కన్పించడం లేదు. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడానికి ఉన్న సాకులన్నీ కేంద్రం ఒక్కొక్కటిగా బయటపెడుతోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉక్కు ఉద్యమం ఎగిసిపడుతోంది. కార్మికుల ఆందోళనలను నిరసనలను కేంద్రం లైట్ తీసుకుంటోంది. అందుకే వంద శాతం ప్రైవేటీకరణ తప్పదనే అంశంలోనే మాట్లాడుతోంది. తాజాగా రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి చెప్పిన సమాధానం కూడా అలాంటిదే.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం పార్లమెంటులో రోజుకో మలుపు తిరుగుతుంది. ఏపీలో నిరసనల దృష్ట్యా రాష్ట్రానికి చెందిన ఎంపీలు అడుగుతున్న ప్రశ్నలకు కేంద్రం రోజుకో క్లారిటీ ఇస్తోంది. దీంతో కేంద్రం వైఖరిపై ఏపీకి చెందిన ఎంపీలు మండిపడుతున్నారు. స్టీల్ ప్లాంట్ మిగులు భూములపై కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ సమాధానం ఇవ్వగా, ఆ తర్వాత రాజ్యసభలో ఉక్కుమంత్రి సమాధానం ఇచ్చారు. దీంతో మండిపడిన వైసీపీ ఎంపీలు వాకౌట్ చేశారు.
రాజ్యసభ చర్చలో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై ప్రశ్నించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి కేంద్రమంత్రి జవాబిచ్చారు. దేశంలో ఉక్కు పరిశ్రమలు కోకింగ్ కోల్ కొరతను ఎదుర్కొంటున్న విషయం వాస్తవమేనని బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశంలో కోకింగ్ కోల్ కొరత కారణంగా ఉక్కు పరిశ్రమలు విదేశాల నుంచి కోల్ దిగుమతి చేసుకుంటన్నట్లు చెప్పుకొచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత బొగ్గు గనులు కేటాయించే పరిస్థితి లేదని పరోక్షంగా స్పష్టం చేశారు.
అంతకుముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అంగీకరించేది లేదని రాజ్యసభలో స్పష్టం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయ సాయిరెడ్డి. నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల్ని పునరుజ్జీవానికి ప్రణాళిక రూపొందించడానికి బదులు ప్రైవేటీకరించి చేతులు దులుపుకోవాలని చూడడం తగదంటూ కేంద్ర ప్రభుత్వ తీరును నిలదీశారు. గనులు, ఖనిజాల సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఈ కామెంట్స్ చేశారు విజయ సాయి రెడ్డి.
ఏదీ ఏమైనా మరోసారి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం స్సష్టమైన సంకేతాలు ఇచ్చింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటూ ఎంపీలు పార్లెమెంటు దృష్టికి తెస్తున్నా అవేవీ పట్టించుకోకుండా మొండి వైఖరి ప్రదర్శిస్తోంది.