AP Bandh: ఏపీలో కొనసాగుతున్న బంద్‌

AP Bandh: వైసీపీ దాడులకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ

Update: 2021-10-20 09:44 GMT

ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న బంద్ (ఫోటో ది హన్స్ ఇండియా)

AP Bandh: టీడీపీ కార్యాలయాలు, నేతలపై జరిగిన దాడులకు నిరసనగా రాష్ట్ర బంద్ కొనసాగుతోంది. ఏపీలోని పలు ప్రాంతాల్లో బంద్ ప్రభావం కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే టీడీపీ శ్రేణులు రోడ్డెక్కారు. 13 జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్టాండుల వద్ద భైఠాయించి, బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

టీడీపీ నాయకులు, పోలీసులు మధ్య పలుచోట్ల వాగ్వాదాలు జరిగాయి. నిరసనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అరెస్టులు కూడా చేశారు. నిరసన ప్రదర్శనలు, బస్టాండుల వద్ద ఆందోళనలకు సిద్ధమవుతున్న కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు బంద్ జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపుమేరకు బంద్ పాటించేందుకు ఆపార్టీ నేతలు సన్నద్ధమవుతుండగా పలు చోట్ల ముందస్తు అరెస్టులు జరుగుతున్నాయి. టీడీపీ నేతలను రాత్రి నుంచే గృహనిర్బంధంలో ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జులు, కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు సహా వివిధ ప్రాంతాల్లో నేతలను నిర్బంధించారు. బంద్ కారణంగా పరిస్థితి అదుపు తప్పకుండా చూసేందుకు పోలీసులు అదనపు బలగాలను రంగంలో దింపారు. అనేక చోట్ల ప్రధాన కూడళ్లలో పోలీసులు మోహరించారు. బస్లాండ్ల ముందు పెద్ద సంఖ్యలో పోలీసులు కనిపిస్తున్నారు. టీడీపీ నేతలు ఆర్టీసీ బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో వారిని నిలువరించే ప్రయత్నం జరుగుతోంది. బస్సులు యధావిధిగా తిరిగేందుకు అనుగుణంగా పోలీసు యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది.

Tags:    

Similar News