ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి ముందుకెళ్తామని అన్నారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్. సుప్రీంకోర్టు తీర్పును తప్పనిసరిగా పాటిస్తామన్న ఆయన రాష్ట్రంలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. రెవెన్యూ డివిజన్ ప్రాతిపదికనే ఎన్నికల నిర్వహణ ఉంటుందని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పోలింగ్ సమయాల్లో కొంత మార్పు చేశామన్నారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ. ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని నిమ్మగడ్డ చెప్పారు. తొలి విడతలో విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించడంలేదని స్పష్టం చేశారు ఎస్‌ఈసీ.
పంచాయతీరాజ్‌శాఖ సరైన పనితీరు కనబర్చడం లేదని అన్నారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ. నేటి నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందన్న ఎస్‌ఈసీ సిబ్బంది కొరత, నిధుల కొరత ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించి తీరుతామని తేల్చి చెప్పారు. ఎన్నికల నిర్వహణతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని అన్న నిమ్మగడ్డ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తీరు సరిగాలేదని అన్నారు.
ఇక ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు జనవరి 25 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్టు నిమ్మగడ్డ తెలిపారు. జనవరి 27 నామినేషన్ల దాఖలుకు తుది గడువు కాగా జనవరి 28న నామినేషన్ల పరిశీలన ఉంటుందని స్పష్టం చేశారు. 29న నామినేషన్లపై అభ్యంతరాల పరిశీలన, జనవరి 30న అభ్యంతరాలపై తుది నిర్ణయం ఉంటుందని నిమ్మగడ్డ చెప్పారు. జనవరి 31 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు కాగా ఫిబ్రవరి 5న పోలింగ్, అదేరోజు ఫలితాలు వెలువడతాయని స్పష్టం చేశారు నిమ్మగడ్డ.