No Corona Cases: కోవిడ్ ఫ్రీ గ్రామంగా నిలిచిన పుల్లంగి
No Corona Cases: దేశవ్యాప్తంగా విస్తరిస్తూ చుక్కలు చూపిస్తోన్న కరోనాకు సవాల్ విసురుతున్నాయి ఆ గ్రామం.
No Corona Cases: దేశవ్యాప్తంగా విస్తరిస్తూ చుక్కలు చూపిస్తోన్న కరోనాకు సవాల్ విసురుతున్నాయి ఆ గ్రామం. దేశం మొత్తాన్ని కోవిడ్ కబళిస్తోన్న వేళ.. తమ ఊర్లోకి మాత్రం నో ఎంట్రీ బోర్డు పెట్టేసింది. అసలు ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాకుండా ఆదర్శంగా నిలుస్తోన్న ఆ గ్రామం ఏంటి.. కోవిడ్ దరి చేరకుండా వారి తీసుకున్న చర్యలేంటి...?
ఎక్కడ చూసినా కరోనా కల్లోలం. గ్రామాలు.. పట్టణాలు.. పేదలు.. ధనికులు.. కులం.. మతం అని తేడా లేకుండా మహమ్మారి ఏ ప్రాంతాన్ని వదలడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొన్ని గ్రామాలు కరోనాకు దూరంగా ఉన్నాయి. తూర్పు మన్యంలోకి కోవిడ్ ప్రవేశించినా కొన్ని గిరిపుత్రుల గ్రామాల్లోకి మాత్రం ఎంటర్ కాలేకపోయింది. గ్రామస్తుల కఠిన నియమాలు వాళ్లను కరోనా కోరల నుంచి తప్పించాయి.
తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలంలోని పుల్లంగి గ్రామం. ఈ పంచాయతీ పరిధిలో ఉండేది కేవలం 250 మంది మాత్రమే. ఇక్కడ గ్రామ సర్పంచ్, పాలక సభ్యులు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు తూచా తప్పకుండా పాటించడంతో కోరలు చాస్తోన్న కోవిడ్‌కు బ్రేక్ పడింది.
తమ గ్రామంలో కరోనా ప్రవేశించకుండా అప్రమత్తమయ్యారు సర్పంచ్ సహా పాలకవర్గ సభ్యులు. మండల కేంద్రం మారేడుమిల్లి నుంచి సుమారు 30 కిలోమీటర్లు దూరం ఉండే పుల్లంగి గ్రామస్తులకు ముందుగానే పలు సూచనలు చేసారు. గ్రామాన్ని సంరక్షించుకునే బాధ్యత తమపైనే ఉందని స్ధానికులకు వివరంగా చెప్పారు. గ్రామం అంతా ఒక కట్టుబాటులా ఒక కుటుంబంలా వ్యవహరించాలని సూచించారు. దీంతో గిరిపుత్రులు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు.
పుల్లంగి గ్రామంలోకి బయటి వారిని అనుమతించడం లేదు. రాకపోకలు నియంత్రించేందుకు పొలిమేర్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసారు. వంతుల వారీగా గ్రామ యువకులు చెక్ పోస్ట్ దగ్గర పహారా కాస్తున్నారు. గ్రామంలోని ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. ప్రతీ కుటుంబంలోని సభ్యులు ఖచ్చితంగా మాస్కులు ధరించడం వ్యక్తిగత దూరాన్ని పాటించడం వంటి నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఇక గ్రామంలోకి వచ్చే వడ్డీ వ్యాపారులను కూడా కరోనా ప్రభావం తగ్గేవరకు రావొద్దని కోరారు పుల్లంగి గ్రామ సర్పంచ్. ఒకవేళ ఎవరైనా తెలియక వచ్చినా గ్రామ పొలిమేరలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్దే నిలువరించేలా చర్యలు తీసుకుంటున్నారు. పుల్లంగి గ్రామంలో అమలుచేస్తోన్న ఆంక్షలను చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా అభినందిస్తున్నారు. ఇలా తూర్పు మన్యంలో కరోనా కట్టిడికి గిరిపుత్రులు తీసుకున్న నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.