విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనకు ఎల్‌జీ పాలిమర్స్‌దే పూర్తి బాధ్యత : ఎన్జీటీ
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విశాఖ గ్యాస్ లీకేజీ వ్యవహారంలో ఎల్జీ పాలిమర్స్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్త పరిచింది.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విశాఖ గ్యాస్ లీకేజీ వ్యవహారంలో ఎల్జీ పాలిమర్స్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్త పరిచింది. లాక్ డౌన్ నేపధ్యంలో అనుమతులు లేకుండా అక్కడ కార్యకలాపాలు ప్రారంభించడాన్ని ఎన్జీటీ తప్పుపట్టింది. ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించడానికి సహకరించిన అధికారులను గుర్తించి తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ విషయంలో తీసుకున్న చర్యలపై రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని చెప్పింది. ఎల్జీ పాలిమర్స్ ఘటనకు పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేసింది.
ఎల్జీ పాలిమర్స్ డిపాజిట్ చేసిన 50 కోట్ల రూపాయలను మధ్యంతర పరిహారానికి ఉపయోగించాలనీ, తరువాత నిపుణుల కమిటీ లెక్క తేల్చే అంతిమ పరిహారమూ కంపెనీ చెల్లించాలని పేర్కొంది. ఎన్జీటీ ఈ కేసును సుమోటోగా తీసుకుంది. జస్టిస్ శేషశయన రెడ్డి ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల కమిటీతో విచారణ చేయించింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ ఆదర్శ కుమార్ గోయల్ తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం..
- ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ పర్యావరణ అనుమతులు లేకుండానే కార్యకలాపాలు నిర్వహించిందని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు స్పష్టం చేశాయి.
- అది నిబంధనలకు పూర్తి విరుద్ధం కాబట్టి జరిగిన నష్టానికి ఆ కంపెనీయే పూర్తి బాధ్యత వహించాలి.
- పర్యావరణ అనుమతులు లేకుండా కార్యకలాపాలు నిర్వహించడానికి ఎల్‌జీ పాలిమర్స్‌కు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చట్టవిరుద్ధంగా అనుమతించింది.
- తప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలి. దుర్ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల బాధ్యత ఎంతన్నది లోతుగా నిర్ధారించాలి
- అంతిమ నష్టపరిహారాన్ని నిర్ణయించేందుకు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధన సంస్థ (నీరీ) ప్రతినిధులతో కమిటీ వేయాలి. రెండు వారాల్లోపు కేంద్ర పర్యావరణ అటవీశాఖ కార్యదర్శి ఈ కమిటీని ఏర్పాటు చేయాలి. రెండు నెలల్లో ఆ కమిటీ నివేదిక అందించాలి