New twist in AP capital: విశాఖ జిల్లా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే విశాఖ భీమిలి తీరం వైపు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసింది ప్రభుత్వం. అయితే తాజాగా భోగాపురం పేరు తెరమీదకు వస్తోంది. దీంతో విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎక్కడా అనే టాపిక్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భోగాపురమైనా భీమిలి అయినా విశాఖనే కార్యనిర్వాహక రాజధాని అని ప్రభుత్వం సంకేతాలు జారీ చేస్తోంది. రాజధాని ఏర్పాటు కోసం సైలెంట్ గా స్టాటజిక్ ప్లాన్ రెడీ చేస్తోంది జగన్ సర్కార్.
విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తాజాగా మరో కొత్త నిర్ణయం తెరమీదకు వచ్చింది. విశాఖ, విజయనగరం సమీపంలో ఉన్న భోగాపురం పేరును ప్రస్తావిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో భోగాపురం లో ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు ప్రతిపాదనలు చేశారు. ఇందుకు 2వేల 7వందల 3 ఎకరాల స్థల సేకరణ కూడా చేపట్టారు. ఎయిర్ పోర్ట్ తో పాటు ఎయిర్ సిటీ, ఎవియేషన్ అకాడమీ, విమానాల మరమ్మతుల కేంద్రం ఏర్పాటుకు టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది.
ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి రావడంతో రివర్స్ టెండరింగ్ లో భాగంగా భోగాపురంలో సేకరించిన భూముల్లో 5వందల ఎకరాలు వెనక్కు తీసుకున్నారు. ఈ 500 ఎకరాల భూమిని కూడా రాజధాని అవసరాల కోసం వినియోగించుకునేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన బాధ్యతను విశాఖ మహానగర ప్రాంతాక అభివృద్ధి సంస్థకు అప్పగించారు. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు కు చేరుకునేందుకు మెట్రో రైల్ ప్రాజెక్ట్ కు అనుమతులు ఇచ్చారు. మెట్రో నిర్మాణానికి నిధులు సమీకరిస్తున్నారు. మరోవైపు విశాఖ నుంచి భీమిలి మీదుగా భోగాపురం వరకు బీచ్ రోడ్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు కొత్తగా ఆరులైన్ల హైవే ను విస్తరించే పనులు చురుకుగా సాగుతున్నాయి. ఈ పనులన్నీ పూర్తి అయితే భోగాపురానికి రవాణా వ్యవస్థ పెద్ద అసెర్ట్ గా మారనుంది.
మరోవైపు విమానాశ్రాయానికి సేకరించిన మిగులు భూమిని రాజధానికి సంబంధించిన విభాగాలకు కేటాయించనున్నట్లు చర్చ జరుగుతోంది. విశాఖ నుంచి భోగాపురం మధ్య 360 చదరపు కిలోమీటర్లు పరిధిలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. విజయనగరం, డెంకాడ, ఆనందపురం, భీమిలితో పాటు 59 మండలాలను అందులో చేర్చారు. ఈ బాధ్యతను గుజరాత్ కు చెందిన హెచ్ సీపీ డిజైనింగ్ సంస్థకు అప్పగించారు. దీంతో భోగాపురంలో రాజధాని కార్యాలయాలు వస్తాయన్న ప్రచారం జోరందుకుంది. ఏదీ ఏమైనా విశాఖలో కార్యనిర్వాహక పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. మరీ ఈ దూకుడుతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిద్ధం అవుతుందా లేక అమరావతి న్యాయపరమైన సమస్యలతో వెనక్కి తగ్గుతుందా అనేది వేచి చూడాలి.