Ahobilam: నా కళ్యాణ వేడుక చూడగ రారండీ..భక్తులకు భగవంతుని ఆహ్వానం!
Ahobilam: నల్లమల కొండల్లో కొలువైన నారసింహుడు తన కళ్యాణానికి రావాలంటూ భక్తులందరిని స్వయంగా తానే ఆత్మీయంగా ఆహ్వానం
Ahobilam: నల్లమల కొండల్లో కొలువైన నారసింహుడు తన కళ్యాణానికి రావాలంటూ భక్తులందరిని స్వయంగా తానే ఆత్మీయంగా ఆహ్వానించే. .ఆత్మీయ ఆహ్వాన యాత్ర కన్నుల పండుగగా సాగుతొంది ప్రహ్లాదునీతో కలిసి నలభై ఒక్క రోజుల పాటు 33 గ్రామాలలో పర్యటించి చెంచులక్ష్మితో తనకు జరగబోయే కళ్యాణానికి హాజరు కావాలంటూ గ్రామ గ్రామాన పర్యటన చేసే పార్వేట ఉత్సవం.
అహోబిలం కర్నూలు జిల్లాలోని ఓ పవిత్ర పుణ్యక్షేత్రం ఇక్కడ స్వయంభూగా వెలిసిన నరసింహ స్వామి భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. అత్యంత శక్తి వంతుడు అయిన నరసింహుడు గ్రామాల బాట పట్టాడు. ఎందుకో తెలుసా తన వివాహ మహోత్సవం చూసేందు రారండి అంటూ భక్తులను ఆయన స్వయంగా ఆహ్వానిస్తున్నారు.
వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం. ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభువుగా బిలంలో వెలిసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారు. హిరణ్యకశిపుడుని వధించేందుకు నారాయణుడు. నరుడు, సింహం కలసి ఉగ్ర రూపంలో భూమి మీద ఉద్భవించాడు. నరసింహా అవతారం ఎత్తిన ప్రదేశమే అహోబిలం. భక్తుని రక్షించుకునేందుకు ఉక్కుస్థంభం నుంచి శ్రీహరి ఉద్భవించిన పుణ్యక్షేత్రం.
హిరణ్యకశిపుడుని వధించిన తర్వాత మహా విష్ణువు ఉగ్రరూపంతోనే అడవుల బాట పట్టాడు. ముక్కోటి దేవతలు ప్రార్ధించినా నరసింహ రూపం వీడలేదు. అడవుల్లో చెంచు లక్ష్మి చేతి స్పర్శతో శాంతించిన నరసింహా స్వామి ఆమెనే వివాహం ఆడాడు ఈ వేడుక ప్రతీ ఏడాది అహోబిలంలో సంక్రాంతి అనంతరం 44 రోజులకు కొనసాగుతూ వస్తోంది.
తన పెళ్లికి రమ్మని నరసింహ స్వామి బ్రహ్మాది దేవతలను ఆహ్వానించారు. దేవతాలందరీ సమక్షంలో నరసింహ స్వామి, చెంచులక్ష్మి వివాహం వైభవంగా జరుగుతుంది. ఇప్పటికే అదే ఆనవాయితీ అహోబిలంలో కొనసాగుతుంది. నరసింహ స్వామి ఆలయం నుంచి బయటకు వచ్చి 44 రోజుల పాటు 33 గ్రామాల్లో యాత్ర చేసి ప్రతి గడపకు వెళ్లి తన పెళ్లికి రమ్మంటూ ఆహ్వానం పలుకుతారు. ఇది కేవలం అహోబిల క్షేత్రంలో సొంతమైన ప్రత్యేకత..
ఏటా సంక్రాంతి కనుమ పండుగ మరుసటి రోజు నుంచి 41 రోజులు పాటు నారసింహ స్వామి గ్రామాల్లో తిరుగుతూ తన కల్యాణానికి రావాలంటూ భక్తులను ఆహ్వానిస్తాడు.. .ఈ వేడుకతో అహోబిలం పరిధిలో పండుగ వాతావరణం నెలకొంటుంది చెంచులక్ష్మితో జరిగే కళ్యాణం కోసం గ్రామ ప్రజలను అహోబిలం నరసింహ స్వామి ప్రహల్లాదునితో కలిసి ఆహ్వానం పలుకుతూ గ్రామాలకు వస్తాడు. అలా స్వామి వచ్చిన నాడు సంక్రాంతి చేసుకోవటం ఇక్కడ గ్రామ ప్రజలు సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు..సంక్రాంతిని అందరూ మూడు రోజులు జరుపుకుంటే అహోబిల క్షేత్ర పరిసర గ్రామాల ప్రజలు 41 రోజుల పాటు జరుపుకుంటారు. కనుమ రోజు అహోబిల నారసింహుడు ఆలయం వదిలి బయటకు రాగానే అక్కడ ఒక్కో గ్రామంలో సంక్రాంతి ఉత్సవాలు మొదలవుతాయి. ఆళ్లగడ్డ, రుద్రవరం, ఉయ్యాలవాడ, సిరివెళ్ల మండలాల పరిధిలో ఈ గ్రామాలు ఉన్నాయి. 600 ఏళ్ల నుంచి ఈ వేడుకలు కొనసాగుతన్నాయి. ఈ ఉత్సవాన్ని పార్వేట ఉత్సవం అంటారు.
అహోబిలం స్వామి ఏ రోజు తమ గ్రామానికి వస్తారో ఆ రోజు తమ ఇంటి అరుగులను శోభాయామానంగా అలంకరిస్తారు. వీధుల్లో ముత్యాల ముగ్గులు వేస్తారు... ఎరుపు, తెలుపు రంగులతో అరుగులను అలంకరించి స్వామికి ఆహ్వానం పలుకుతారు... ఆ రోజు పిండి వంటలు చేసుకుంటారు అదే సంక్రాంతి స్వామి వారు తమ గ్రామానికి వచ్చిన రోజున శాఖహార వంటకాలు మాత్రమే చేసుకుంటారు. భక్తి, శ్రద్దలతో స్వామిని దర్శనం చేసుకుని వివాహ ఆహ్వానం అందుకుంటారు.
బంధువుల ఆహ్వనం...
బ్రహ్మ స్వయంగా నరసింహ స్వామి కళ్యాణం జరిపిస్తారని, నారసింహుడిని పెళ్లి కొడుకుగా చూసేందుకు, వేడుక జరిపేందుకు ముక్కోటి దేవతలు తరలివస్తారని భక్తుల విశ్వాసం పాల్గున శుద్ధ పౌర్ణమి నాడు జరిగే ఈ కల్యాణ వేడుకకు అహోబిలం సమీపంలోని 33 గ్రామాల ప్రజలు తరలి వస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్టాలకు చెందిన భక్తులు కూడా అహోబిలం బాట పడతారు.
భక్తుల గోవిందా నామస్మరణ మధ్య నరసింహ స్వామి, చెంచు లక్ష్మి కళ్యానోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది. జనవరి మాసంలో సంక్రాంతి వస్తే పర్వేట ఉత్సవం జరిగే గ్రామాల్లో మాత్రం స్వామి వారి రాకతోనే పండుగ వస్తుంది. బంధుమిత్రులను ఈ ఉత్సవానికి ఆహ్వానిస్తారు.
హైందవ సంస్కృతి సంప్రదాయాలకు ఆయా గ్రామాల్లో ముస్లిం సోదరులు సైతం ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు. వారు కూడా స్వామి ఉత్సవానికి తమ బంధువులను పిలుచుకుని పండుగ జరుపు కుంటారు. భక్తి శ్రద్దలతో స్వామిని పూజిస్తారు. ఈ పర్వేట ఉత్సవం కుల మతాలకు అతీతంగా జరుగుతుంది. ప్రతి గృహస్తుడిని తన వివాహానికి రమ్మంటూ నరసింహుడు ఆహ్వానిస్తారు. స్వామి ఏ గ్రామానికి వస్తే ఆ గ్రామంలో ఇళ్లన్నింటినీ ముందు రోజే శాస్త్రోక్తంగా శుద్ది చేసి సంప్రోక్షణ చేస్తారు. స్వామి గ్రామంలో తిరిగే రోజు ఏ ఒక్కరూ మాంసాహారం ముట్టరు. నరసింహుడు గ్రామం దాటి వెళ్లిన మరుసటి రోజు మాత్రం కనుమ పండుగ, అదే నీసు పండుగ జరుపుకుంటారు. అంతా సంబరాలు చేసుకుని మాంసాహారాన్ని భుజిస్తారు.
స్వామి వారి ఉత్సవ విగ్రహానికి సంబంధించి 44 రోజుల పాటు 33 గ్రామాలు పర్యటిస్తున్న సమయంలో విగ్రహాలను మోసేందుకు రెండు గ్రామాలలో వున్నటు వంటి ప్రజలు బోయలుగా సేవ చేస్తూ ఉంటారు.. వీరంతా ఒక్కో గ్రామం నుంచి వంద కుటుంబాల చొప్పున అన్ని ఉత్సవాల్లో పల్లకి మోసి తమ భక్తిని చాటుకుంటున్నారు
పార్వేట ఉత్సవం సమయంలో నలభై ఒక్క రోజుల పాటు వ్యాపార కార్య కలాపాలు నిర్వహించుకుంటూ చిరు వ్యాపారులు జీవనం సాగిస్తారు. తమ తాత తండ్రుల కాలం నుండి నరసింహుని నమ్ముకుని హాయగా జీవిస్తున్నామని చెబుతున్నారు.
అహోబిలంలో నరసింహస్వామి తొమ్మిది రూపాల్లో భక్తులకు దర్శనం ఇస్తారు... గృహ, గ్రహ దోషాలు స్వామిని దర్శించుకుంటే పోతాయని భక్తుల నమ్మకం... ఇక తన కల్యాణానికి స్వామి స్వయంగా ఇంటింటికి వెళ్లి పిలవటం ఓ గొప్ప ఆచారం... ఈ 44 రోజులు ఈ పరిసర గ్రామాల్లో పండుగే... ఇక స్వాతి నక్షత్రం, కళ్యానోత్సవం, స్వామి వారి రధోత్సవం చూసి తరించాలిసిందే....
అహోబిలేశుడు తన దేవేరి చెంచు లక్ష్మితో ఒక్కటయ్యే ఆ దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవు. బ్రహ్మ స్వయంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తాడనీ, నారసింహుని పెళ్లి కొడుకుగా చూసేందుకు ముక్కోటి దేవతలు తరలి వస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఫాల్గుణ శుద్ద పున్నమి రోజున జరిగే ఈ కళ్యాణ మహోత్సవానికి అహోబిలం చుట్టుపక్కల గల 33 గ్రామాల ప్రజలతో పాటు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. నరిసింహస్వామి కల్యాణం చూసి తన్మయం చెందుతారు. ఈ నెల 28న పర్వాటే ఉత్సవం అహోబిలం చేరుకుంటుంది. మార్చి 18 నుంచి జాతర ప్రారంభం అవుతుంది.