ఏపీలో రాష్ట్రపతి పాలన.. హెచ్చరించిన ఎంపీ రఘురామకృష్ణరాజు

ఆంధ్రప్రదేశ్ లో శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు..

Update: 2020-10-12 10:55 GMT

ఆంధ్రప్రదేశ్ లో శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శించారు. అమరావతి భూ యజమానుల పోరాటం గురించి నరసాపురంలో రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన రఘురామా ఈ వ్యాఖ్యలు చేశారు.. అమరావతిలో భూ యజమానులను మోసగించిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేసేలా ప్రయత్నాలు కొనసాగుతుందని ఆయన ఆరోపించారు.

దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన విచారణ పూర్తి చెయ్యాలని సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణ ఆదేశించిన తరుణంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనపై గతంలో నమోదైన అక్రమాస్తుల కేసులను విచారణ జరపాల్సిందిగా కోరడానికి బదులు విచారణ జరుపుతున్న న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని రఘురామరాజు వ్యాఖ్యానించారు. తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా వ్యవస్థలను భ్రష్టు పట్టించడం తగదని అన్నారు. ముఖ్యమంత్రి అనాలోచిత చర్యలవల్ల రాజ్యాంగ సంక్షోభం తలెత్తి రాష్ట్రపతి పాలన దిశగా వెళ్లే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

ఇదిలావుంటే రఘురామకృష్ణరాజు పై కూడా ఇటీవల సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆయన కంపెనీ రూ. 800 కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకు (pnb) వద్ద లోన్ గా తీసుకొని తిరిగి కట్టకుండా ఎగ్గొట్టిందని pnb సిబిఐ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు అయింది. ప్రస్తుతం ఈ కేసులో విచారణ జరుగుతుంది. ఇటు రఘురామరాజు మాత్రం తన ఇళ్లపై సిబిఐ సోదాలు జరగలేదని అంటున్నారు. 

Tags:    

Similar News